ఐశ్వర్యారాయ్.. ఒకప్పటి విశ్వసుందరి. అంతేకాదు.. విశ్వవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న అందాల భరిణె. తమిళ చిత్రం "ఇరువర్"తో కెరీర్ మొదలుపెట్టి.. బాలీవుడ్‌లో అగ్రతారగా ఎదిగిన మేటి నటి. అమితాబ్ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టి.. ఇప్పుడు చిన్నారి ఆరాధ్యకు తల్లిగా కూడా తనవంతు పాత్ర పోషిస్తున్న "ఐష్" జన్మదినం సందర్భంగా ఆమె జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికకర విషయాలు మీకోసం


  • కర్ణాటకలోని మంగళూరులో కృష్ణరాజ్, బృంద దంపతులకు 1 నవంబరు, 1973 తేదీన జన్మించిన ఐశ్వర్యారాయ్ మాతృభాష తుళు. చిన్నతనంలోనే తన కుటుంబంతో సహా ముంబై వెళ్లిపోయిన ఐశ్వర్య తన హైస్కూల్‌ను ఆర్య విద్యామందిర్‌లోనూ, ఇంటర్మీడియట్‌ను జైహింద్ కళాశాలలోనూ చదివారు. టీనేజ్‌లో ఉండగా శాస్త్రీయ సంగీతం, నృత్యం నేర్చుకున్నారు. తొలుత ఈమె మంచి ఆర్కిటెక్టు్ అవ్వాలని భావించారట. అందుకే రచనా సంసంద్ అకాడమీ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో విద్యార్థినిగా చేరారు. అయితే అనుకోకుండా సినిమా అవకాశాలు రావడంతో ఆ రంగం నుండి తప్పుకున్నారు 


  • 1991లో ఫోర్డు సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ సూపర్ మోడల్ కాంటెస్టులో ప్రథమ బహుమతి గెలుచుకున్నారు ఐశ్వర్య. అప్పటికి ఆమెకు 18 సంవత్సరాలు మాత్రమే. అప్పుడే తొలిసారిగా ఆమె ఫోటోలు ప్రఖ్యాత అమెరికన్ పత్రిక "వోగ్" మ్యాగజైన్‌లో ప్రచురితమయ్యాయి. 1994లో నిర్వహించిన మిస్ ఇండియా పోటీలో సుస్మితా సేన్ విజేత కాగా, ఐశ్వర్య రన్ రప్‌గా నిలిచారు. అయితే అదే ఐశ్వర్య, మిస్ వరల్డ్ పోటీల్లో మాత్రం ఒక చరిత్రనే తిరగరాశారు. అదే సంవత్సరం మిస్ వరల్డ్ టైటిల్ గెలిచి విశ్వసుందరిగా వార్తల్లోకెక్కారు 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


  • 1997లో తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన  "ఇరువర్" చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ఐశ్వర్య, అందులో ద్విపాత్రాభినయం చేయడం విశేషం. అదే సంవత్సరం "ఔర్ ప్యార్ హో  గయా" అనే హిందీ చిత్రంలో కూడా నటించారు. 1998లో ఆమె నటించిన "జీన్స్" చిత్రం తమిళంలో తీసినా, హిందీ, తెలుగు భాషల్లో కూడా డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. 


  • 1999లో ఐశ్వర్య, సల్మాన్ ఖాన్ జంటగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన "హమ్ దిల్ దే చుకే సనమ్" బ్లాక్ బస్టర్ అయ్యి, ఆమె కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికే ఆమె తొలిసారిగా ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం అందుకున్నారు. అదే సంవత్సరం విడుదలైన తాళ్ చిత్రం కూడా సూపర్ హిట్ అవ్వడంతో బాలీవుడ్‌లో అగ్రతారగా ఐశ్వర్య స్టార్ హోదాను పొందారు.


  • ఆ తర్వాత ఐశ్వర్య నటించిన మొహబ్బతే, దేవదాస్, బంటీ ఔర్ బబ్లీ, ఉమ్రావ్ జాన్, ధూమ్ 2, గురు, జోధా అక్బర్, రావణ్ మొదలైన చిత్రాలు ఆమె కెరీర్‌లోనే బెస్ట్ చిత్రాలుగా నిలిచిపోయాయి 


  • ఐశ్వర్యరాయ్ నటించిన తొలి బెంగాలీ చిత్రం "చోకర్ బాలీ" 2003లో విడుదలయైంది. ప్రముఖ దర్శకురాలు రీతుపర్ణ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎన్నో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ఈ సినిమాలో ఐష్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించడం విశేషం. 


  • ఆ తర్వాత హాలీవుడ్‌లో కూడా ఐశ్వర్య పలు చిత్రాల్లో నటించారు. అందులో బ్రైడ్ అండ్ ప్రిజ్యూడైస్ (2004), ది మిస్టర్ ఆఫ్ స్పైసిస్ (2005), ప్రొవొక్క్డ్ (2007), ది లాస్ట్ లీజియన్ (2007), ది పింక్ పాంథర్ 2 (2009) ప్రముఖమైనవి


  • ఏప్రిల్ 2007లో ఐశ్వర్యరాయ్, బాలీవుడ్ నటుడు మరియు అమితాబ్ బచ్చన్ కుమారుడైన అభిషేక్ బచ్చన్‌ను వివాహమాడారు. వీరిద్దరూ 2009లో "కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌"లో కలిసి పాల్గొనడం విశేషం. 


  • ఐశ్వర్యారాయ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈమెకు అంకితమిస్తూ ఆమె పేరు మీద దాదాపు 17000 ఫ్యాన్ వెబ్‌సైట్స్ ఉన్నాయి.   2011లో  ఐశ్వర్య, బేబి ఆరాధ్యకు జన్మనిచ్చింది. ఆమెను అమితాబ్ నిక్ నేమ్ "బిగ్ బి" పేరు మీద "బేటి బి" అని పిలుచుకోసాగారు అభిమానులు


  • ఐశ్వర్య ఖాతాలో ఇప్పటికి 2 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 7 ఐఫా అవార్డులు, 7 స్టార్ స్క్రీన్ అవార్డులు, 2 జీ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డులు, 4 స్టార్ డస్ట్ అవార్డులు ఉన్నాయి. 2009లో భారత ప్రభుత్వం ఐశ్వర్యకు "పద్మశ్రీ" పురస్కారాన్ని అందించింది.