విజయా ప్రొడక్షన్స్..  ఈ పేరు తెలుగు సినీ వికాస క్రమంలో ఎంత ప్రముఖ పాత్ర పోషించిందో మనకు తెలియని విషయం కాదు. షావుకారు, పాతాళభైరవి, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ, పెళ్లి చేసి చూడు లాంటి మేటి చిత్రాలను అందించిన ఈ సంస్థ వెనుక ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. అంతేకాదు.. చందమామ లాంటి బాలల పత్రికను తెలుగువారికి అందించిన సాహిత్యాభిమాని. తన స్నేహితుడు చక్రపాణితో కలిసి తెలుగు సినీరంగాన ఆయన చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీకావు. అలనాటి మేటి నిర్మాత బి.నాగిరెడ్డి జీవితం నేటి ప్రొడ్యూసర్లకు నిజంగానే ఆదర్శప్రాయం. మేటి దర్శకుడు బిఎన్ రెడ్డికి స్వయాన సోదరుడైన నాగిరెడ్డి 105వ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం మీకోసం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిసెంబరు 2, 1912 తేదీన కడప జిల్లా కొండాపురానికి దగ్గరలో ఉన్న పొట్టిపాడు గ్రామంలో జన్మించారు నాగిరెడ్డి. చిన్నప్పుడే  పురాణాల్లో కథల పట్ల మక్కువ పెంచుకున్న నాగిరెడ్డి తొలుత రచనా వ్యాసంగం వైపు వెళ్లాలని భావించారట. అయితే పాఠశాల విద్య పూర్తి కాకుండానే ఆయనను తన కుటుంబ వ్యాపారంలో పాలుపంచుకోవడానికి ఇంట్లోవారు బర్మా పంపించేశారు. అయితే సాహిత్యం పట్ల మక్కువ గల ఆయనకు మంచి పత్రికను ప్రారంభించాలనే ఆలోచన ఉండేది. 


రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాగిరెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యాపార సరుకులను దిగుమతి చేసే ఓడ మునిగిపోవడంతో భారీగా నష్టం వచ్చింది. వ్యాపారం ఆగిపోవడంతో ఉన్న సమయాన్ని పాడుచేయడం ఇష్టంలేక ఆయన ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించి.. ఓ పత్రికను కూడా నెమ్మదిగా నడపసాగారు. అయితే.. అప్పటికే నాగిరెడ్డి పెద్ద అన్నయ్య బిఎన్ రెడ్డి చిత్రరంగంలో ఉండడంతో ఆయన ద్వారా దర్శకుడు కెవి రెడ్డికి పరిచయమయ్యారు ఆయన. యువకుడైన నాగిరెడ్డిలోని చురుకుదనాన్ని గమనించి...తాను తీస్తున్న భక్త పోతన సినిమా ప్రచారానికి సంబంధించిన బాధ్యతలు అప్పగించారట కెవి రెడ్డి.


జెమినీ వారి "బాలనాగమ్మ" చిత్రానికి దీటుగా సినిమా పబ్లిసిటీ ఉండాలని కెవి రెడ్డి చెప్పడంతో కొత్తగా ఆలోచించారు నాగిరెడ్డి. ఉన్న బడ్జెట్‌లోనే పెద్ద పెద్ద రంగుల కటౌట్లు పెట్టించి సినీ ప్రచారానికి నాంది పలికారు. అటువంటి ప్రచారం అప్పటికి ఎవరూ చేయకపోవడంతో ఆ సినిమా గురించి జనాలకు బాగానే తెలిసింది. చిత్రం విడుదలయ్యాక నిర్మాతకు లాభాలూ వచ్చాయి.


నాగిరెడ్డి ప్రతిభను గుర్తించిన కెవి రెడ్డి బాగా పబ్లిసిటీ చేశావని చెప్పి, 500 రూపాయలు బహుమతిగా ఇచ్చారట. చిత్ర రంగానికి వచ్చాక నాగిరెడ్డి సంపాదించిన తొలి సంపాదన అది. ఆ తర్వాత తన అన్న బిఎన్ రెడ్డి  "స్వర్గసీమ" తీస్తున్నప్పుడు తనను కలవడానికి వచ్చిన మరో యువ రచయిత చక్రపాణితో నాగిరెడ్డికి పరిచయమైంది. ఇద్దరూ సాహిత్యమంటే చెవికోసుకోవడంతో వారి పరిచయం స్నేహంగా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. నాగిరెడ్డి తనకు వచ్చే కొత్త  కొత్త ఆలోచనలను అన్నీ చక్రపాణితో చెప్పేవారు. 


నాగిరెడ్డి ఆలోచనలను ఆచరణలో పెట్టందే చక్రపాణికి నిద్రపట్టేది కాదు. బెంగాలీ రచయిత శరత్ బాబు రాసిన నవలల్ని చదివి.. వాటిని తెలుగులో అనువాదం చేస్తే ఎలాగుంటుంది అన్న ఆలోచన నాగిరెడ్డికి వస్తే.. వెంటనే దానిని అమలు జరిపారట చక్రపాణి. చక్రపాణి నవలలు అనువాదం చేస్తే.. ఆ నవలలను ప్రింట్ చేసే బాధ్యతలను నాగిరెడ్డి చూసుకొనేవారు.  చక్రపాణికి బహుభాషలు రావడం కూడా నాగిరెడ్డికి కలిసి వచ్చింది. ఆ తర్వాత ఈ ఇద్దరు మిత్రులూ కలిసి 1947లో  చిన్న బడ్జెట్‌తో ఒక పత్రికను నెలకొల్పాలన్న ఆలోచనకు వచ్చారు. అనేక తర్జనభర్జనల తర్వాత అది ఒక బాలల పత్రిక అయితే బాగుంటుంది అనుకున్నారట. అలా "చందమామ" ఆవిర్భావం జరిగింది. కొడవటిగంటి కుటుంబరావు లాంటి మేటి రచయిత ఆ పత్రికకు  సంపాదక బాధ్యతలు చేపట్టడం విశేషం.


పత్రిక నడుపుతూనే నాగిరెడ్డి  "విజయా ప్రొడక్షన్స్" పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ నిర్మించిన అనేక చిత్రాలకు చక్రపాణి కథ, మాటలు అందించారు. మాయాబజార్, మిస్సమ్మ, గంగ మంగ, పాతాళ భైరవి లాంటి చిత్రాలను ఈ ఇద్దరు మిత్రులూ కలసి నిర్మించారట. కొంతకాలం తర్వాత తన అన్న బిఎన్ రెడ్డి, మూలా నారాయణ స్వామి అనే మరో నిర్మాతతో కలిసి ప్రారంభించిన వాహిని స్టూడియోస్‌ నష్టాల్లో ఉన్నప్పుడు దానిని కొనుగోలు చేశారు నాగిరెడ్డి. తర్వాత అదే "విజయ వాహిని స్టూడియోస్‌"గా రూపాంతరం చెందింది. విజయా సంస్థ నిర్మించిన మేటి చిత్రాల్లో "మాయాబజార్"కు ఎప్పుడూ ఒక ప్రముఖ స్థానం ఉంటుంది. 1957లో విడుదలైన ఆ చిత్రం తాలుకు స్క్రీన్ ప్లే, ఇప్పటికీ భారతీయ దర్శకులందరికీ ఒక పాఠ్యాంశం లాంటిదని చెబుతుంటారు.


అయితే తెలుగులో సినిమాలు తీస్తున్న నాగిరెడ్డి ఆలోచనలు అక్కడితోనే ఆగిపోలేదు. తమిళంతో పాటు, హిందీలో కూడా చిత్రాలు తీయడం మొదలుపెట్టారు. తెలుగులో డి.రామానాయుడు తీసిన "రాముడు భీముడు" చిత్రాన్ని హిందీలో దిలీప్ కుమార్ హీరోగా "రామ్ ఔర్ శ్యామ్"గా తీస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన రాగానే.. చిత్ర హక్కులు తీసుకొని ధైర్యంగా తీసేశారు. ఆ సినిమా హిట్ అవ్వడంతో అలాంటి ప్రయోగాలు లెక్కలేనన్న చేశారు నాగిరెడ్డి. దాసరి దర్శకత్వంలో తెలుగులో వచ్చిన "స్వర్గం నరకం" చిత్రాన్ని హిందీలో  "స్వర్గ్ నరక్ " పేరుతో మళ్లీ దాసరినే దర్శకుడిగా పెట్టి తీశారు. తెలుగులో దాసరి, మోహన్ బాబు చేసిన పాత్రలను హిందీలో సంజీవ్ కుమార్, జితేంద్ర చేయడం విశేషం. గుండమ్మ కథ, రాముడు భీముడు చిత్రాలకు సంబంధించిన తమిళ వెర్షన్స్‌కి నాగిరెడ్డి దర్శకత్వం వహించడం విశేషం. గుండమ్మ కథ తమిళ వెర్షన్‌లో జెమినీ గణేషన్ నటిస్తే, రాముడు భీముడు తమిళ వెర్షన్‌లో ఎంజీఆర్ నటించారు.


ఒకవైపు సినిమాలు తీస్తున్నా.. చందమామ పత్రికపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు నాగిరెడ్ది. ఆ పత్రిక సాధించిన ఊహించని విజయంతో విజయచిత్ర, వనిత లాంటి పత్రికలు కూడా ప్రారంభించారు. అయితే అవి తర్వాత ఆగిపోయాయి. 1975లో చక్రపాణి మరణించాక, నాగిరెడ్డి గారి జీవితంలో లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది. తెలుగులో సినిమాలు తీయడం కూడా తగ్గించారు. 1987లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నాగిరెడ్డిని వరించింది. అదే సంవత్సరం రఘుపతి వెంకయ్య అవార్డు కూడా పొందారు. అంతకు ముందే తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారంతో నాగిరెడ్డిని సత్కరించింది. పలు విశ్వవిద్యాలయాలు నాగిరెడ్డికి డాక్టరేట్లు కూడా అందించాయి. 


సినీ రంగంతోటే నాగిరెడ్డి కీర్తి ఆగిపోలేదు. 1980లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన ట్రస్టీగా వ్యవహరించారు. 1972లో విజయా హాస్పిటల్స్ ప్రారంభించారు. 25 డిసెంబరు 2004 తేదిన నాగిరెడ్డి గారు తుది శ్వాస విడిచారు. ఆయన మరణించిన కొన్నాళ్లకు చందమామ పత్రికను ఓ ఉత్తర భారత సంస్థకు విక్రయించడం జరిగింది. నాగిరెడ్డి కుమారుల ఆధ్వర్యంలో కొన్నాళ్లు పత్రిక నడిచినా... ఆ తర్వాత మళ్లీ కొన్నాళ్లు ఆపివేసి.. ఆ తర్వాత విక్రయించేశారు. అయితే ఆయన వారసుల ఆధ్వర్యంలో నడుస్తున్న విజయా ప్రొడక్షన్స్ ప్రస్తుతం తమిళ నాట చిత్ర నిర్మాణంలో ఉంది. ఇటీవలి కాలంలో వీరమ్, భైరవ లాంటి చిత్రాలను నిర్మించింది ఆ సంస్థ.