ఏప్రిల్ 20వ తేదీన భరత్ అనే నేను సినిమా ఆడియెన్స్ ముందుకు రానుంది. అంటే ఈ సినిమా విడుదలకు ఇంకా వారం రోజుల సమయం పడుతుందన్న మాట. కానీ అంతకన్నా ముందే అప్పుడే ఈ సినిమాకు బ్రీఫ్ రివ్యూలు రాయడం మొదలుపెట్టాడు ప్రముఖ ఫిలిం క్రిటిక్‌గా ప్రచారంలో వున్న ఉమెర్ సంధు. అవును, మహేష్ బాబు కుటుంబానికి సన్నిహితంగా మెదిలే స్నేహితులు వెల్లడించిన సమాచారం ప్రకారం భరత్ అనే నేను సినిమా టెర్రిఫిక్‌గా వుండబోతోందని తెలుస్తోంది అని ఉమెర్ సంధు ఓ ట్వీట్ చేశాడు. అంతేకాదు.. భరత్ అనే నేను సినిమా బాహుబలియేతర సినిమాల రికార్డులని బద్ధలు కొడుతుంది అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు ఉమెర్. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో తుది మెరుగులు దిద్దుకుంటోంది. దాదాపుగా ఈ వారాంతంలో సెన్సార్ క్లియరెన్స్‌కి వెళ్లే అవకాశాలున్నట్టుగా యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తుండగా.. బాలీవుడ్ నటి కియారా అద్వాని అతడికి జంటగా కనిపించనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


హీరోగా మహేష్ బాబుకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుందో... దర్శకుడిగా కొరటాల శివకు అంతే స్థాయిలో అభిమానులు వున్నారు. అంతేకాకుండా ఆ ఇద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన శ్రీమంతుడు సినిమా టాలీవుడ్ రికార్డ్స్ తిరగరాసిన సినిమాల్లో ఒకటి. దీనికితోడు.. ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా కొరటాలకు మంచి పేరుంది. ఇవన్నీ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. 

 

అయితే, భరత్ అనే నేను సినిమా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి కాకముందే ఉమెర్ సంధు ఈ సినిమా గురించి గొప్పగా చెప్పడంపై మాత్రం భిన్నరకాల వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో బ్రహ్మోత్సవం సినిమా రిలీజైన సందర్భంలోనూ ఉమెర్ ఇలాగే చెప్పాడని అతడి మాటలను నమ్మొద్దని కొంతమంది లైట్ తీసుకుంటుంటే.. ఇంకొంతమంది మాత్రం 'భరత్ అనే నేను' గురించి ఉమెర్ చేసిన ట్వీట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.