Bharatheeyudu 2 Movie Review: ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ.. కమల్ హాసన్ ఖాతాలో హిట్ పడినట్టేనా..
Bharatheeyudu 2 Movie Review: 28 యేళ్ల క్రితం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘భారతీయుడు’. ఈ సినిమా క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇపుడీ మూవీకి సీక్వెల్ గా ‘భారతీయుడు 2’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సఫలమైందా.. ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
రివ్యూ: ‘భారతీయుడు 2’ (Review)
నటీనటులు: కమల్ హాసన్, సిద్ధార్ధ్, రకుల్ ప్రీత్ సింగ్, సముద్రఖని, ఎస్.జే.సూర్య, ప్రియా భవానీ శంకర్, వివేక్ తదితరులు..
ఎడిటింగ్: ఏ.శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
సంగీతం: అనిరుథ్ రవిచంద్రన్
నిర్మాత: లైకా ప్రొడక్షన్స్ (సుభాస్కరన్)
దర్శకత్వం: శంకర్
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చింది. మరి ఈ సినిమాకు సీక్వెల్ గా దాదాపు 28 యేళ్ల తర్వాత ‘భారతీయుడు 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
చిత్ర అరవిందన్ (సిద్ధార్ధ్) తన స్నేహితులతో కలిసి ‘బార్కింగ్ డాగ్స్’ పేరిట ఓ యూట్యూబ్ ఛానెల్ ను రన్ చేస్తూ ఉంటాడు. సమాజంలో జరిగే చిన్న తప్పుల నుంచి పెద్ద పెద్ద విషయాలను తమ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ప్రస్తావిస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ ఉంటారు. ఈ క్రమంలో చదువు కోసం విద్యా ఋణం తీసుకున్న ఓ పేద యువకుడు లోన్ ఏజెంట్స్ బాధ తట్టుకులేక రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకుంటాడు. అటు మరో అమ్మాయి.. లంచం ఇచ్చుకోలేక చనిపోతుంది. ఇలా రకరకాల సమస్యలపై ‘బార్కింగ్ డాగ్స్’ పేరిట చిత్ర అరవిందన్ టీమ్ స్పందిస్తూ ఉంటుంది. వీరు సమాజంలో అశాంతిని ప్రబలే చేస్తున్నారంటూ పోలీసులు వారిని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ‘భారతీయుడు’ వస్తే బాగుండు అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తారు. అది చూసి ఎక్కడ విదేశాల్లో ఉన్న భారతీయుడు (సేనాపతి) దగ్గరకు ఆ విషయం చేరుతుంది. ఈ క్రమంలో భారతీయుడు మళ్లీ మన దేశంలో అడుగుపెడతాడు. ఈ క్రమంలో దేశంలో అవినీతిపరులను భారతీయుడు ఎలా శిక్షించాడనేదే ‘భారతీయుడు 2’ స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
శంకర్.. కమల్ హాసన్ తో తెరకెక్కించిన ‘భారతీయుడు’ సినిమా సమయానికి అదో కొత్త సబ్జెక్ట్. అంతేకాదు కమల్ హాసన్ అప్పటి వరకు ఎవరు చూడని గెటప్ లో చూపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసాడు శంకర్. ముఖ్యంగా లంచగొండితనంపై శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రం. జెంటిల్మెన్ సినిమా నుంచి ప్రతి సినిమాలో ఏదో ఒక సామాజిక సందేశం ఇస్తూనే వస్తున్నాడు. ఇపుడు ‘భారతీయుడు 2’లో కూడా అదే సందేశం ఇవ్వాలనే ప్రయత్నం చేసాడు. అప్పట్లో భారతీయుడు సినిమా స్పూర్తితో ఎన్నో సినిమాలు వచ్చాయి. కొన్ని హిట్టైయితే.. కొన్ని బొక్క బోర్లా పడ్డాయి. తాజాగా ‘భారతీయుడు 2’ సినిమా చూస్తే.. శంకర్ తన పాత సినిమాలనే మిక్సీలో వేసి సరికొత్తగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేసాడు.
అదే భారతీయుడు, అపరిచితుడుల సినిమాలోని కాన్సెప్ట్ లను తీసుకునే ‘భారతీయుడు2’ తెరకెక్కించాడు. ఒక రకంగా చెప్పాలంటే తను తెరకెక్కించిన ‘భారతీయుడు’ సినిమానే మళ్లీ రీమేక్ చేసినట్టు ఉంది. అందులో భావోద్వేగాలు బాగా పండాయి. ఇందులో అవి పండలేదనే చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియా పిలుపుతో స్పందించిన భారతీయుడు మళ్లీ మన దేశానికి రావడం. అతన్ని పట్టుకోవడానికి మన దేశ పోలీసులు, సీబీఐ ప్రయత్నించడం వంటివి రొటీన్ గా ఉన్నాయి. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రకారం చూసుకుంటే.. సినిమాను ఎంతో లావిష్ గా తెరకెక్కించాడు శంకర్. ఈ సినిమాలో ప్రతి సీన్ లో రిచ్ నెస్ కనపడింది. కానీ సినిమాకు ఆత్మ వంటి కథను మిస్ చేసాడు. పైగా సెకండాఫ్ లో భారతీయుడు వల్ల హీరో బ్యాచ్ ఇంట్లో వాళ్లకు దూరం కావడం. ప్రజలు ఆయనపై తిరగబడటం..గో బ్యాక్ ఇండియన్ అంటూ నినాదాలు చేయడం వంటివి కన్విన్స్ గా లేవు. కానీ క్లైమాక్స్ ఫైట్ లో చేసిన ఛేజింగ్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అనిరుథ్ రవిచంద్రన్ ఇచ్చిన పాటలు సోసో గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగా కొట్టాల్సింది. ఫస్టాఫ్ తో పాటు సెకండాఫ్ లో అనవసర సీన్స్ చాలా ఉన్నాయి. వాటికి తోడు ఈ సినిమాకు ఇంకో భాగం అన్నట్టు ‘భారతీయుడు 3’ ఉన్నట్టు ఈ సినిమాలో చివర్లో చూపించారు. మొత్తంగా శంకర్... సినిమా ఎడిటర్ కు తన పని చేయనిచ్చి ఉంటే బాగుండేది.
నటీనటుల విషయానికొస్తే..
కమల్ హాసన్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. నటనలో వంక పెట్టాల్సిన పనిలేదు. ఆయన మట్టి లాంటి నటుడు. దాన్ని అందమైన కుండగా మలుచుకోవడంలో శంకర్ తడబడ్డాడు. సిద్ధార్ధ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తల్లి చనిపోయే సీన్ లో అతని నటన ఆకట్టుకుంది. ఇక ఎస్.జే.సూర్య, సముద్రఖని ఉన్నంతలో పర్వాలేదనిపించారు. మిగతా నటీనటుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది.
ప్లస్ పాయింట్స్
కమల్ హాసన్ నటన
ఫోటోగ్రఫీ
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ, కథనం
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సినిమా నిడివి
పంచ్ లైన్.. ‘భారతీయుడు 2’.. గో బ్యాక్ ఇండియన్..
రేటింగ్.. 2.25/5
Read more: Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి