న‌టీన‌టులు: నాగార్జున అక్కినేని, నాని, ర‌ష్మిక, ఆకాంక్ష సింగ్, న‌రేష్ వికే, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్, రావు ర‌మేష్
వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, స‌త్య తదితరులు
ద‌ర్శ‌కుడు: శ్రీ‌రామ్ ఆదిత్య‌
నిర్మాత‌: అశ్వనీద‌త్
బ్యానర్: వైజయంతి మూవీస్, వ‌యాక‌మ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్
సినిమాటోగ్ర‌ాఫ‌ర్: శ్యామ్ ద‌త్
సంగీతం: మ‌ణిశ‌ర్మ
ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహీ సురేష్
నిడివి: 164 నిమిషాలు
సెన్సార్: U/A
రిలీజ్ డేట్: 27-09-2018


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మల్టీస్టారర్ అనగానే కేవలం ఆ హీరోల అభిమానులే కాదు, టోటల్ ఇండస్ట్రీ అంతా ఆ సినిమా వైపు చూస్తుంది. ఎందుకంటే వీటిని హ్యాండిల్ చేయడం అంత కష్టం. అందుకే మల్టీస్టారర్లు తక్కువగా వస్తుంటాయి. హీరోలు కూడా మల్టీస్టారర్ చిత్రాలపై అంతగా ఆసక్తి చూపించరు. ఇలాంటి టైమ్‌లో నాగ్, నాని కలిసి చేసిన మల్టీస్టారర్ దేవదాస్ థియేటర్లలోకి వచ్చింది. మరి రిజల్ట్ ఏమైంది? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ


కథ
దాస్ ఓ డాక్టర్. కార్పొరేట్ హాస్పిటల్‌లో పనిచేయలేక ఓ చిన్న క్లినిక్ నడిపిస్తుంటాడు. దేవ ఓ మాఫియా డాన్. ఓ గొడవ కారణంగా హైదరాబాద్ వచ్చిన దేవకు ఎన్‌కౌంటర్‌లో బుల్లెట్ గాయం అవుతుంది. పోలీసుల నుంచి తప్పించుకొని దాస్ క్లినిక్‌కు చేరుకుంటాడు. గాయంతో వచ్చిన దేవాను దాస్ ఆదుకుంటాడు. దాస్ మంచి మనసుకు దేవ కూడా ఫిదా అవుతాడు. అలా ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోతారు. మరోవైపు పోలీసులు దేవా కోసం వెదికే క్రమంలో దాస్‌పై ఓ కన్నేసి ఉంచుతారు. ఈ క్రమంలో దేవాను వలపన్ని పట్టుకుని అరెస్ట్ చేసే సమయానికి, దాస్ సమక్షంలోనే దేవా ఓ క్రిమినల్‌ను చంపేస్తాడు. ఆ చావు చూసి చలించిపోయిన దాస్, దేవాతో ఫ్రెండ్‌షిప్ కట్ చేసుకుంటాడు. అదే సమయంలో దాస్ చెప్పిన మాటలు దేవాను మార్చేస్తాయి. ఫైనల్‌గా దాస్, దేవ కలిశారా లేదా..? విలన్లు, పోలీసులు ఏమయ్యారు? మధ్యలో రష్మిక, ఆకాంక్షల స్టోరీ ఏంటి? ఇది తెలియాలంటే దేవదాస్ చూడాల్సిందే.


నటీనటుల పనితీరు:
ఇందులో పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే మొదట నాగ్ గురించో లేక నాని గురించో స్టార్ట్ చేయకూడదు. ఇద్దరి గురించి కలిపి మాట్లాడుకోవాలి. అవును.. దేవ పాత్రలో నాగ్, దాస్‌గా నాని అదరగొట్టారు. వీళ్లిద్దరు తెరపై కలిసి నటించిన తీరు అదిరిపోయింది. ఒక దశలో నాగ్, నాని మధ్య వయసు తేడా కూడా కనిపించలేదంటే అది ఈ సినిమా గొప్పదనం. నేచురల్ పెర్ఫార్మెన్స్‌తో నాని మరోసారి ఆకట్టుకున్నాడు. డాక్టర్‌గా, దేవాకు ఫ్రెండ్‌గా, అక్కడక్కడ ప్రేమికుడిగా బాగా చేశాడు.


ఇక నాగార్జున గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మన్మధుడు అనే ట్యాగ్ లైన్‌కు నాగ్ మరోసారి న్యాయం చేశాడు. ఓవైపు యాక్షన్, మరోవైపు లవ్, ఇంకోవైపు ఫ్రెండ్‌షిప్.. ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పటికీ ఎక్కడా బ్యాలెన్స్ తప్పలేదు.  ఓవరాల్‌గా నాని, నాగార్జునలే ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్.


హీరోయిన్స్‌లో రష్మిక మరోసారి వెయిట్ ఉన్న పాత్ర పోషించగా.. ఆకాంక్ష సింగ్ కూడా తన పాత్రకు ఉన్నంత పరిధిలో బాగా చేసింది. ఇతర నటీనటుల్లో సీనియర్ నరేష్, బాహుబలి ప్రభాకర్, రావు రమేష్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్ లాంటి నటులు ఉన్నప్పటికీ థియేటర్ నుంచి బయటకొచ్చిన తర్వాత వాళ్లెవరూ గుర్తుకురారు.


 
టెక్నీషియన్స్ పనితీరు
ఈ సెక్షన్‌లో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది శ్రీరామ్ ఆదిత్య గురించే. ఇద్దరు పెద్ద హీరోల్ని ఒప్పించడంలోనే శ్రీరామ్ ఆదిత్య సగం సక్సెస్ కొట్టేశాడు. తర్వాత వాళ్లను స్క్రీన్‌పై పర్‌ఫెక్ట్‌గా చూపించడంలో, ఎక్కువతక్కువలు లేకుండా బ్యాలెన్స్‌గా కథను నడిపించడంలో శ్రీరామ్ ఆదిత్య తన టాలెంట్ చూపించాడు. కానీ ఇద్దరు స్టార్స్‌ను పెట్టుకొని కూడా అక్కడక్కడ పేలవమైన సన్నివేశాలు రాసుకున్నాడు.


శ్రీరామ్ ఆదిత్య తర్వాత చెప్పుకోదగ్గ టెక్నీషియన్ శ్యామ్ దత్. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేసిన శ్యామ్ దత్, బ్రహ్మాండమైన అవుట్-పుట్ ఇచ్చాడు. హీరోహీరోయిన్లు అందర్నీ అందంగా చూపించడంతో పాటు ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దాడు. మణిశర్మ ఎప్పట్లానే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అదరగొట్టాడు. పాటలు మాత్రం రెండే బాగున్నాయి. ఆర్ట్ డైరక్టర్, ఎడిటర్ వర్క్ బాగుంది. ఇక ప్రొడక్షన్ హౌజ్ విషయానికొస్తే.. వైజయంతీ మూవీస్ బ్యానర్‌కు తగ్గట్టు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గ్రాండియర్‌గా సినిమాను నిర్మించారు నిర్మాత అశ్వనీదత్.


సీనియర్ హీరోలు మల్టీస్టారర్లు ఎందుకు చేయాలి. అలాంటి సీనియర్లు చెప్పిన వెంటనే యంగ్ హీరోస్ ఆ మల్టీస్టారర్ సినిమాల్లో నటించడానికి ఎందుకు ఒప్పుకోవాలి. దేవదాస్ చూస్తే ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరికిపోతుంది. కచ్చితంగా ఓ సీనియర్ హీరో, మరో యంగ్ స్టర్ కలిసి చేయాల్సిన సినిమా ఇది.


దేవగా నాగార్జున, దాస్‌గా నాని పర్ ఫెక్ట్ గా సింక్ అయ్యారు. సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ వీళ్లే. నాని, నాగ్‌ను కాకుండా మరో ఇద్దరు హీరోల్ని ఈ సినిమాలో ఊహించుకోలేం. అంతలా దాసు, దేవ మెప్పిస్తారు. అంతెందుకు, సినిమాలో కథ, అక్కడక్కడ సన్నివేశాలు కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ ప్రేక్షకుడు పక్కచూపులు చూడకపోవడానికి కారణం వీళ్లిద్దరి కెమిస్ట్రీనే.


చిన్న హీరోలతో ఇప్పటికే శమంతకమణి లాంటి మల్టీస్టారర్ చేసిన శ్రీరామ్ ఆదిత్యకు దేవదాస్ మాత్రం సిసలైన పరీక్షలా నిలిచింది. ఓవైపు నాగార్జున లాంటి పెద్ద హీరో, మరోవైపు వరుస హిట్స్‌తో ఊపుమీదున్న నాని.. ఇలాంటి ఇద్దరు హీరోలతో కథను పర్‌ఫెక్ట్‌గా నడిపించాడు. సెకెండాఫ్‌లో అక్కడక్కడ బలమైన సన్నివేశాలు రాసుకోవడంలో శ్రీరామ్ ఆదిత్య తడబడ్డాడు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌ను మరీ లాజిక్‌కు దూరంగా లాగించేశాడు. ఎండ్ కార్డ్‌కు ముందు కూడా కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు అనిపిస్తాయి. అయినప్పటికీ నాగ్, నాని మేజిక్ ముందు అంతా కొట్టుకుపోయింది. ఓ కంప్లీట్ మూవీ చూసిన ఫీలింగ్‌తో ప్రేక్షకుడు బయటకొస్తాడు. ఓవరాల్‌గా దేవదాస్ సినిమా అన్ని వర్గాల్ని ఆకట్టుకుంటుంది. “అన్ని వర్గాలు” అనే పదాన్ని ఏదో అలవాటుగా వాడేశామని మాత్రం అనుకోవద్దు. ఫ్యామిలీస్, యూత్, లేడీస్.. ఇలా అందరికీ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా దేవదాస్.


రేటింగ్ – 3.25/5