మహమ్మద్ రఫీ 93వ పుట్టినరోజు జరిపిన గూగుల్
నేడు ప్రముఖ నేపథ్యగాయకుడు మహమ్మద్ రఫీ జయంతి. గూగుల్ దాని హోమ్ పేజీపై డూడుల్ ఉంచి మహమ్మద్ రఫీ యొక్క 93వ పుట్టినరోజును జరిపింది.
నేడు ప్రముఖ నేపథ్యగాయకుడు మహమ్మద్ రఫీ జయంతి. గూగుల్ దాని హోమ్ పేజీపై డూడుల్ ఉంచి మహమ్మద్ రఫీ యొక్క 93వ పుట్టినరోజును జరిపింది. హిందీ సినీ వినీలాకాశంలో మహమ్మద్ రఫీ సుప్రసిద్ధ నేపథ్యగాయకుడు. 'రఫీ సాహబ్' పేరుతో అందరికీ సుపరిచితులు ఈయన. ముఖ్యంగా హిందీ సినిమాలకు పాటలు పాడారు. ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషల్లో కూడా రఫీ తన గాత్రదానం చేశారు. 17 భాషల్లో తన గానంతో అందరినీ అబ్బురపరిచారు.
రెండు దశాబ్దాలపాటు (1950-70) హిందీ సినీ ఇండస్ట్రీలో మహమ్మద్ రఫీ యుగం నడిచింది. రఫీ-లతా మంగేష్కర్ జోడీకి బాలీవుడ్ ప్రేక్షకులే కాదు యావత్ భారత ఉపఖండం బ్రహ్మరథం పట్టింది. వీరి జోడీ హిందీ నేపథ్యగాన చరిత్రలో కొత్త ఒరవడిని, రికార్డును సృష్టించింది. కేవలం రఫీ పాటలతో వందలకొద్ది చిత్రాలు హిట్టయ్యాయంటే అతిశయోక్తి కాదు. రాజేంద్ర కుమార్, షమ్మీ కపూర్ లు రఫీ పాటలతోనే హిట్టయ్యారు. రాజేంద్రకుమార్ కేవలం రఫీ పాటలతోనే 'సిల్వర్ జూబ్లీ' హీరో అయ్యారు.
దిగ్గజ నేపథ్యగాయకుడు మహమ్మద్ రఫీ ప్రస్థానం
* డిసెంబర్ 24,1924వ సంవత్సరంలో కోట్లా సుల్తాన్ సింగ్, పంజాబ్, బ్రిటీష్ ఇండియాలో జననం.
* హిందుస్థానీ క్లాసికల్ సంగీతం ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్, ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్, పండిత్ జీవన్ లాల్ మట్టూ మరియు ఫిరోజ్ నిజామిల వద్ద సంగీతం నేర్చుకున్నారు.
* శ్యాంసుందర్ అనే సంగీతకారుడు రఫీని గుర్తించి 1944లో విడుదలైన పంజాబీ సినిమా 'గుల్ బలోచ్'లో జీనత్ బేగం తోడుగా పాడనిచ్చారు.
* రఫీ 'గాన్ కి గోరి' (1945) అనే చిత్రం ద్వారా తొలిసారి హిందీ సినిమాల్లో ప్రవేశించారు.
* రఫీతో కొంగర జగ్గయ్య తొలిసారి తెలుగులో పాడించారు. నాగయ్య దర్శకత్వంలో వచ్చిన భక్తరామదాసు చిత్రంలో కబీరు పాత్రకు (గుమ్మడి వెంకటేశ్వరరావు) నేపథ్యగానం చేశారు.
* అప్పట్లో ఎన్టీరామారావు, రఫీల మధ్య సాన్నిహిత్యం బాగుండేది. అందుకే ఎన్ఠీఆర్ సొంత సినిమాల్లో రఫీ ఎక్కువ పాడారు. భలే తమ్ముడు, తల్లా? పెళ్ళామా?, రామ్ రహీమ్, ఆరాధన, తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, అక్బర్ సలీం అనార్కలి సినిమాలు వాటిలో కొన్ని.
* జులై 31, 1980వ సంవత్సరంలో, 55 ఏళ్ల వయస్సులో మమమ్మద్ రఫీ మరణించారు.
అవార్డులు
* నేషనల్ ఫిలిం అవార్డు (1977)-1
* ఫిలిం ఫేర్అవార్డులు (1960, 1961, 1964, 1966, 1968,1977)- 6
* బెంగాల్ ఫిలిం జర్నలిస్ట్స్ అసోషియేషన్ అవార్డ్స్ (1957, 1965, 1966)- 3
* సుర్ శ్రింగర్ అవార్డు(1964)-1
గౌరవాలు
1948 - స్వతంత్ర భారత మొదటి సాంవత్సరిక ఉత్సవాలలో రజత పతాకాన్ని జవహర్లాల్ నెహ్రూ చేతుల ద్వారా ప్రదానం చేయబడింది.
1967 - భారత ప్రభుత్వంచే పద్మశ్రీ బిరుదు ప్రదానం చేయబడింది.
2001 - హీరో హోండా మరియు స్టార్ డస్ట్ మేగజైన్ల ద్వారా "బెస్ట్ సింగర్ ఆఫ్ ద మిలీనియం" గౌరవ ప్రదానం.
2013 - సిఎన్ఎన్-ఐబిఎన్ పోల్ లో గ్రేటెస్ట్ వాయిస్ ఇన్ హిందీ సినిమాగా ఎన్నికయ్యారు.