(#METoo) మీటూ ఉద్యమంలో  ఓ కీలక అడుగు పడింది. హాలీవుడ్ మూవీ మొఘల్, ప్రముఖ నిర్మాత హార్వీ వెయిన్ స్టీన్‌(67)కు 23ఏళ్ల జైలు శిక్ష విధించారు. నటీమణులతో అసభ్యప్రవర్తన, హత్యాచారయత్నం కేసులలో విచారణ జరిగిన అనంతరం బుధవారం (మార్చి 11న) కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. నిందితుడు హార్వీ వెయిన్ స్టీన్‌‌ను దోషిగా గుర్తించి శిక్ష ఖరారు చేయగానే ఆయనపై ఆరోపణలు చేసిన ఆరుగురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యక్షంగా కేసు విచారణకు హాజరైన నటీమణులలో కొందరు ఆనందభాష్పాలు రాల్చడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మన్‌హటన్‌లోని స్టేట్ సుప్రీంకోర్టులో కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ జేమ్స్ ఏ బర్క్ విచారణ తర్వాత స్పందించారు. ఇది ఆయనపై నడిచిన తొలి కేసు అయినా చేసింది తొలి తప్పుకాదన్నారు. సాధారణంగా ఈ కేసులో ఆయనకు 5ఏళ్ల జైలుశిక్ష పడేదని, అయితే విచారణలో సహకరించకపోవడం, న్యాయవాదులతో దురుసుగా వ్యవహరించడంతో కేసు సుదీర్ఘ విచారణకు వెళ్లిందన్నారు. తద్వారా హర్వీ వెయిన్ స్టీన్‌కు రెండు దశాబ్దాలకు పైగా జైలుశిక్ష విధించాల్సి వచ్చిందని వివరించారు.


2006లో తనతో బలవంతంగా ఓరల్ సెక్స్ చేయించాడని మిరియం హేలీ చేదు అనుభవాన్ని మరోసారి కోర్టుకు తెలిపారు. ఈ ఘటనతో తన జీవితం తలక్రిందులైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నటి జేస్సికా మన్‌పై హార్వీ వెయిన్ స్టీన్ అత్యాచారం చేశాడని సైతం రుజువైంది. 2013లో మన్ హటన్‌లోని ఓ హోటల్‌లో జెస్సీకాపై జరిగిందని, అందుకుగానూ ఆ కీచకుడికి కఠిన శిక్ష వేయాలని న్యాయమూర్తిని ఆమె కోరారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం నటీమణులపై అత్యాచారం, వేధింపుల కేసులో దోషిగా తేలిన నిర్మాత హార్వీ వెయిన్ స్టీన్‌కు జస్టిస్ జేమ్స్ ఏ బర్క్ 23ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.


మీటూ సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి


కాగా, హాలీవుడ్‌లో నిర్మాత హార్వీ వెయిన్ స్టీన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో మొదలైన మీటూ ఉద్యమం భారతదేశ చలనచిత్ర పరిశ్రమలను సైతం కదిలించింది. అన్ని ఇండస్ట్రీలలో నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను బహిర్గతం చేసి నిందితులకు శిక్ష పడాలని ఆకాంక్షించారు.


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..