బయోపిక్: మొట్టమొదటిసారి టీచర్‌గా హృతిక్ రోషన్ !
ఇండియాలో గ్రీక్ గాడ్‌గా పేరున్న బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తన తర్వాతి ప్రాజెక్టు వివరాలు ప్రకటించాడు.
ఇండియాలో గ్రీక్ గాడ్‌గా పేరున్న బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తన తర్వాతి ప్రాజెక్టు వివరాలు ప్రకటించాడు. సూపర్ 30 పేరిట తెరకెక్కనున్న కొత్త సినిమాలో హృతిక్ ఓ టీచర్ గెటప్ వేస్తున్నాడు. హృతిక్ రోషన్ తన మొత్తం కెరీర్‌లో టీచర్ పాత్ర పోషించడం ఇదే మొదటిసారి. బీహార్‌కి చెందిన ప్రముఖ మ్యాథమెటిషియన్ ఆనంద్ కుమార్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ సినిమా ఇది. ఐఐటీ ప్రవేశం లక్ష్యంగా కృషిచేసే విద్యార్థులకి ఓ వరంగా మారిన సూపర్ 30 ప్రోగ్రామ్‌తో ఆనంద్ కుమార్ దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు. టీచర్ స్టోరీ కావడంతో బసంత్ పంచమి సందర్భంగా నిన్న సరస్వతి పూజతో ఈ సినిమా ప్రారంభమైంది. సూపర్ 30 జర్నీ మొదలైంది అంటూ హృతిక్ రోషన్ స్వయంగా ట్విటర్‌లో షేర్ చేసుకున్న వివరాలతోనే ఈ న్యూస్ బయటికొచ్చింది.
రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫాంథమ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హృతిక్ సరసన హీరోయిన్ ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. కత్రినా కైఫ్‌ని హృతిక్‌కి జోడీగా తీసుకున్నట్టుగా గతంలో ప్రచారం జరిగినప్పటికీ ఆ విషయాన్ని ఎవ్వరూ అధికారికంగా ధృవీకరించలేదు. కుంకుం భాగ్య సీరియల్ నటి మృణాల్ థాకూర్‌ని హీరోయిన్‌గా తీసుకోవాలని భావిస్తున్నట్టుగానూ ఓ ప్రచారం జరుగుతోంది.
లైఫ్ ఆఫ్ పై సినిమా నిర్మాత డేవిడ్ వుమర్క్ తన తర్వాతి ఇండో-అమెరికన్ సినిమా లవ్ సోనియా కోసం మృణాల్ థాకూర్‌ని తీసుకున్న తర్వాత బాలీవుడ్‌లోనూ ఆమెకి మంచి డిమాండ్ ఏర్పడింది. పలువురు దర్శకులు, నిర్మాతల దృష్టిని ఆకర్షించిన మృణాల్ తాజాగా సూపర్ 30 డైరెక్టర్ వికాస్ బహల్ కంట్లోనూ పడినట్టు టాక్.