తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా సినిమా థియేటర్లలో విడుదల అవడంకన్నా ముందుగా ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షమవడం ఆ చిత్ర నిర్మాతలకు ఊపిరి ఆపినంత పనిచేసింది. గురువారం కాలా చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా అంతకన్నా ముందుగానే ఓ వ్యక్తి తన ఫేస్‌బుక్ పేజీపై కాలా చిత్రాన్ని 40 నిమిషాలపాటు ప్రత్యక్షప్రసారం (లైవ్ స్ట్రీమ్) చేయడం పరిశ్రమవర్గాల్లో కలకలం సృష్టించింది. పైరసీపై ఉక్కుపాదం మోపుతోన్న తమిళ చిత్రవర్గాలు కాలా పైరసీని తీవ్రంగా పరిగణించాయి. కాలా పైరసీని సీరియస్‌గా తీసుకున్న యాంటీ పైరసీ టీమ్ వెంటనే ఆ వీడియోను ఫేస్‌బుక్‌లోంచి తొలగించేలా చర్యలు తీసుకోవడంతోపాటు ఆ దుశ్చర్య వెనుకున్న నిందితుడిని అరెస్ట్ చేయించింది. కాలా పైరసీ సింగపూర్ నుంచి జరిగింది అని గ్రహించిన యాంటీ పైరసీ బృందాలు వెంటనే ఆ సమాచారాన్ని సింగపూర్ పోలీసులకు తెలియజేయడంతో అప్రమత్తమైన సింగపూర్ పోలీసులు అక్కడ కాలా పైరసీకి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాలా పైరసీకి పాల్పడిన వ్యక్తిని సింగపూర్ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేయడం వెనుక నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం తమిళనాట అటు సినీ పరిశ్రమలో ఇటు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానుల నుంచి విశాల్‌కి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 


గతంలో బాహుబలి 2 సినిమా సైతం పైరసీ బారిన పడిన సందర్భంలో వెంటనే అప్రమత్తమైన విశాల్.. చెన్నై పోలీసులు, యాంటీ పైరసీ బృందాల సహాయంతో బాహుబలి -2 పైరసీని అడ్డుకుని, ఆ పైరసీ వెనుకున్న నిందితులను అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే.