Kantara Movie Audience Review: కాంతార, ఒక గొప్ప అనుభూతి.. అద్భుతం అంటూ గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ఎన్నారై రివ్యూ
Kantara Movie Audience Review: సూపర్ హిట్ గా నిలిచిన కాంతార సినిమా అన్ని వర్గాల నుంచి మంచి టాక్ అందుకుంటోంది, తాజాగా ఈ సినిమా గురించి తెలుగు ఎన్నారై మాధవ్ అందించిన రివ్యూ మీకోసం
Kantara Movie Audience Review: (సంస్కృతంలో, కన్నడలో కాంతార అర్థం: రహస్యమైన అరణ్యం,) నిన్న చూసిన ఒక అద్భుత చిత్రం కాంతారా గురించి రాయాలనిపించింది. మీరు ఈ చిత్రం తప్పక చూడాలి. కన్నడ లో రిషబ్ శెట్టి గారు తీసిన ఈ చిత్రం తెలుగు, హిందీ, ఇతర భారతీయ భాషల్లో వచ్చి, అందరిచేతా ప్రశంసలందుకొంటున్నది. హిందూ సనాతన ధర్మం పాటిస్తూ, ఇష్టపడే వ్యక్తిగా, ఆ కోణంలో ఎన్నో గొప్ప వజ్రాల్లాంటి విషయాలు చూసాను. ఇంకెందుకు ఆలస్యం? వజ్రాల వేటకు బయలుదేరుదామా?
ఈ చిత్ర కథ ఏంటి?
కర్ణాటకలో తుళు భాష మాట్లాడే తుళునాడు ప్రాంతీయుల్లో, కేరళ - కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కాసర్గోడ్ ఏరియా అరణ్యంలో ఉన్న వారి నమ్మకాలు, సంస్కృతి, అమాయకత్వం, ఆ దేవత, ఆ ఆదివాసీ ప్రజల్లో ఎలా మమేకమయి వాళ్ళను సంరక్షించారు అనే ఒక గొప్ప దృశ్య రూపమీచిత్రం. ప్రతి కథలో లాగే దీంతో నాయక, నాయిక, ప్రతినాయకులు, ఇతర పాత్రధారులున్నారు. సిమిలారిటీ అంతవరకే. ఈ కథ, కథనం, కథ రాసి,డైరెక్ట్ చేసి, హీరోగా నటించిన రిషబ్ శెట్టి నట విశ్వరూపం, అద్భుతమైన నేపథ్య సంగీతం (BGM), కర్ణాటక ప్రకృతి అందాల్లో, దట్టమైన అరణ్యాల్లోకి మనను తీసుకుపోయే ఫోటోగ్రఫి, మంచి నటీనటులతో, చూసాక చాలా రోజులవరకు మనను వదిలిపెట్టదు ఈ చిత్రం. ఆద్యంతం బోరు కొట్టించకుండా, ఇంకో లోకంలోకి తీసుకువెళ్లి, మనను వాళ్ళల్లో కలిసిపోయినంత చిక్కగా, చక్కగా, కథ కొనసాగుతుంది. నేను మీకు కథ చెప్పదలుచుకోలేదు. నా వజ్రాల వేటలో దొరికిన నిధిని పంచుకొందామనుకుంటున్నా.
* చిత్రం మూడింటి మధ్య సంఘర్షణ : భూస్వాములుగా సహజ ప్రకృతి సంపదను తన్నుకుపోయే భూస్వాములు, అమాయక గిరిజన ప్రజలు, అటవీ సంరక్షణ శాఖ. మూడింటిని కలుపుతూ, వాళ్ళకతీతంగా ఆ ప్రకృతి దేవత పార్వతి దేవి ఈ నెల మీ ముగ్గురిదీ కాదు, నాది అని చెప్పి సమతుల్యత తేవటం (ecological balance ) అనేది చూసి తీరాల్సిన అనుభూతి.
* తుళు ప్రాంతీయ పురాణం ప్రకారం పార్వతి దేవి పెంచుకున్న వరాహం కైలాసంలో అలజడి సృష్టిస్తే, శివుడు దాన్ని అక్కడ "మాయం" చేసి, భూమిపైన ఈ ప్రాంతానికి "పంజుర్లి" వరాహ దేవతగా పంపాడు. సాక్షాత్ పార్వతి దేవి రాయి రూపంలో దేవతయ్యింది. పంజుర్లి దేవత వాళ్ళను సంరక్షిస్తుంది. ఆ వరాహంకు ఆవేశం,ఆకలి ఎక్కువ. పంజురితో పాటు క్షేత్రపాలకుడిగా "గుళిగ" ను కూడా పంపుతారు. కర్ణాటకలో ఉన్న నానుడి "పంజుర్లి వదిలినా తప్పుచేస్తే నిన్ను గుళిగ వదలడు". ఈ గుళిగ అక్కడ "భూత కల" అనే ఒక ప్రత్యేక సంగీత నాట్యకళ చేసే (కథాకళి లా ఉంటుంది) వారిలోపలికి ప్రవేశించి, జరిగింది, జరగబోయేది చెప్పి, వాళ్ళను సంరక్షిస్తాడు. (మన దగ్గర "దేవుడు మీదకి రావటం", "పూనకం" ఇలా రక రకాల పేర్లతో చూస్తాము. దాదాపు ఇండియా అంతా ప్రతి ప్రాంతంలో కుల దేవత, గ్రామ దేవత, వన దేవత రూపంలో ఇలాంటివున్నాయి).
* శివుడు పార్వతి ఆది దంపతులు. వారికి వివిధ అంశలతో రూపాలున్నాయి, వివిధ రూపాల్లో శివపురాణం కొనసాగుతుంది. ఆది అనాది ఏదీ లేని అనంత దాంపత్యం వారిది. విష్ణు మూర్తి రకరకాల ఉద్దేశ్యాలతో దశావతారాలెత్తి, అవి ముగిశాక విష్ణువుగా మారతారు, లోకానికి, జీవులకు అస్తిత్వాన్ని, ఉన్నత స్థితిని ఇస్తాడు. శివుని అంశాలైన కాల భైరవుడు, రుద్రుడు, వీరభద్రుడు, హనుమంతుడు, ఈ చిత్రంలో ఉన్న పంజుర్లి, గుళిగ, వీరు కాలాతీతులు, ఎదో రూపంలో కొనసాగుతూనే ఉంటారు.
* దశావతారాల్లో, మత్స్య (చేప), కూర్మ (తాబేలు ) అవతారాలు నీటి నుండి ఒడ్డు వైపువస్తే, వరాహం భూమి పైన నడిచే మొదటి అవతారం. అందుకే పార్వతి వరాహమును కైలాసంలో పొందింది. చిత్రంలో వచ్చే వరాహం అద్వైత రూపం, శివ-విష్ణు తత్వాలు రెండూ ఉన్నాయి. అందుకే చిత్రమంతా అది రక్షకుడు (protector), నిర్మూలకుడు (destroyer ) గా మారుతుంటుంది, అలాగే "శివ" (ప్రధాన పాత్ర ఐన రిషబ్ ) ను మారుస్తుంటుంది!
* జాతక సంహిత ప్రకారం, నవగ్రహాలు, మనిషి జన్మ లగ్నం దశావతారాలను సూచిస్తాయి. వరాహావతారం రాహువు, తన అధిష్టాన దేవత దుర్గ. అందుకే పార్వతి కలియుగంలో కోరికల వ్యాప్తి/వినాశనానికి తన ప్రతిరూపంగా వరాహం ఇచ్చింది.
* గుళిగ (లేదా గుళిక), శని యొక్క పుత్రుడు. (పంచాంగంలో గుళిక యోగం చూస్తుంటాం మనం). శని కర్మలను శాసించే, శిక్షించే కఠిన గురువు. ఆయన కొడుకు కదా గుళిగ కూడా అంతే.
* అందుకే చిత్రమంతా, పంజుర్లి (వరాహం) ధర్మబద్ధమైన కోరికలను తీరుస్తుంది, పరిధి దాటితే శపిస్తుంది. గుళిగ "భూత కల" చేస్తున్న వ్యక్తిలో ప్రవేశించి శిక్షలు వేస్తాడు.
ఒకవేళ పంజుర్లి వదిలిన గుళిగ వదలడు అనేది అందుకే. శివుణ్ణి కూడా చెట్టు తొర్రలో దాగేట్టు "ఏలినాటి శని" చేసాడంటాం కదా!
* చిత్రమంతా శివ తత్వమే నిజానికి. వనజ (వనంలో పుట్టింది), హిమజ/పార్వతి (పర్వతాల్లో జనించింది ). ప్రకృతే పార్వతి. ప్రకృతి ఉన్న చోట ఉండే పురుషుడు అర్ధ నారీశ్వరుడైన ఆది యోగి శివుడు! అందుకే చిత్రం అడవిలో మొదలవుతుంది, చివరకు అడవిలోనే ఉంటుంది.
* ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే, ఆగ్రహించి కరువుకాటకాలు, తుఫానులు, భూకంపాలు, సునామీలు వస్తాయి. మంచి/చెడు, పుణ్యం పాపం లేకుండా, అన్ని రకాల జీవులు జీవం కోల్పోతాయి కదా. (వాళ్ళ వాళ్ళ పూర్వ జన్మ ప్రారబ్ధ కర్మ శేషం వల్ల, వాళ్ళక్కడ ఉండి, ఆ ఫలితం పొందుతారు ). రిషబ్ శెట్టి ఈ కథ రాశాడా? లేదు. ఆ పంజుర్లి దేవత నే రాయించిందేమో. కథ చివర్లో, కొంతమంది గిరిజనులు, భూస్వామి తో పాటు, అతనికి చెందిన చెడ్డవాళ్ళు, అందరూ పోతారు. ప్రకృతి శాంతిస్తుంది.
* జగన్మాత ఈ చరాచర సృష్టిని నిరంతరం అనుశాసిస్తున్నది. జనన మరణాలు, కష్ట సుఖాలు, ధన దరిద్రాలు, ఆడ మగ, ఉండటం లేకపోవటం ఇవన్నీ బిందురూపము నుండి అఖిలాండకోటి బ్రహ్మాండములుగా మార్చి మాయా లీలా వినోదం చూసే ఆ తల్లికి ఒకటే!
* చిత్రం మెల్లగా కొన"సాగి", చివరి 20 నిమిషాల్లో మనను విభ్రాంతికి గురిచేస్తుంది. తొమ్మిది నెలలు ఓర్పుగా ఎదురుచూసి పండంటి బిడ్డను కన్న తల్లిలా, సంవత్సరమంతా చదివి, పరీక్షలో ఉన్నతమార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ లా, నిశ్చలంగా ఉన్న ఆకాశం భళ్ళున వర్షం కురిపిస్తే మట్టివాసనలతో పులికించి భూమి, పచ్చగా మెరిసిపోయే చెట్లు పూలలా... ఒక చెప్పరాని, చెప్పలేని అనుభూతి మనను ఉద్విగ్నులను చేస్తుంది. చివరి ఇరవై నిమిషాల్లో, సంతోషం, విషాదం, ఎన్నో భావాలు కమ్మి, మన కళ్ళల్లో నీళ్లు! రిషబ్ కనపడితే గట్టిగా hug చేసుకోవాలని , ఏడవాలని, నువ్వు కదా సామి, ఆ దేవతా పుత్రుడివి అని కాళ్లకు మొక్కాలని నాకనిపించింది !
* విష్ణువు నడిచే చైతన్యమైతే, శివుడు యోగిపుంగవుడు. అన్నీ అలంకరించుకొనేది కేశవుడైతే, ఆయనదైన లోకంలో యోగ సాధన చేస్తూ, అందరికి వరాలిస్తూ, ఎప్పుడూ ప్రమథ గణాలను వెంటవేసుకుని తిరుగుతూ, మంచి చెడ్డ చూడకుండా, కేవలం వారి ఆర్తి, తపస్సు, కోరికలను మన్నించి ,అందరిని నమ్ముతూ, వరాలిస్తూ (భస్మాసురుడు, గజాసురుడు, రావణుడు...ఎందరో ), జటలు కట్టినా, పట్టించుకోక, కాలాతీతుడై, అన్నీ తెలిసినా, ఏమీ తెలియనట్టుండే మర్మ యోగి కదా, భోళా శంకరుడు? అదే భోళా శంకరుడికి క్రోధం వస్తే, కాల రుద్రుడైతే, కల్పాంత రుద్రుడైతే? మూడోనేత్రం తెరిచి ప్రళయ రుద్ర తాండవమే కదా చేసి, శత్రు వినాశనం చేసేది? ప్రొటెక్టర్ ఆయనే ! డిస్ట్రాయర్ ఆయనే కదా!
* ఇప్పుడు శివుడి గురించి రాసిందంతా చదవండి. రిషబ్ అసామాన్య రచనా ప్రతిభ తెలుస్తుంది. కథలో హీరో పేరు "శివ", అతను ప్రేమించిన అమ్మాయి పేరు లీలా (ఆంటే దుర్గా/లలితా/పార్వతి). అతను చెట్టుపైన ఏర్పరుచుకున్న చిన్న కాటేజ్ పేరు "కైలాసం". ఎప్పుడూ వెంట ముగ్గురు-నలుగురు ప్రమథ గణం. ఎవ్వరేం అడిగినా వాళ్లకు సాయం చేస్తాడు, మాట ఇస్తాడు, భూస్వామి అయినా, తన గూడెంలో ఎవరైనా, అందరితో ఉంటాడు, ఎవ్వరితో కలవడు. చర్రున వచ్చిన క్రోధంతో అందరినీ చితకబాదుతాడు. నమ్మకద్రోహం తెలిసాక, ప్రళయ రుద్ర తాండవం చేస్తాడు!
ఇది కాంతార.... ఇది ఒక రహస్య అరణ్యం,... వనదేవత "లీలా" రూపిణి, ఆమెకు ప్రియుడైన "శివుని" ప్రకృతి పరిరక్షణా గీతం .....ఈ కథకు ఆది లేదు...అంతముండదు... సనాతన ధర్మం చెప్పే మార్గమదే... మొదట రాసినట్టు, శివుని అంశలు పుట్టి ముందుకు సాగుతూనే ఉంటాయి...శివుని చిన్నప్పుడే "భూత కళ" వేషధారి అయిన తండ్రి అరణ్యంలో అదృశ్యమైపోయాడు... అదే చేసి, తమ్ముడు అదే దారి... మరి శివ ది ఏదీ దారి? లీల గర్భవతి అయిందని చూపి... లాస్ట్ పది సెకన్లలో రిషబ్ శెట్టి చూపిన చిత్రం క్లైమాక్స్ "న భూతొ న భవిష్యతి" ఎవ్వరూ ఊహించలేనిది...
ఇంకో 5 నిమిషాలైతే చిత్రం అయిపోతుందనేప్పుడు, శివ, అటవీ అధికారి, గూడెంలో ఉన్న అందరి చేతులు కలుపుకుంటూ, గుళిగ తనలో చూపే అత్యద్భుత నృత్య, ముఖ కవళికలు మిళితం చేస్తూ కళ్ళతో చెప్పే ప్రతి "మాటా" సినిమాహాల్ లో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమౌతుంది!.... కన్నీళ్లు, విభ్రాంతి, సంతోషం, విచారం, దైవభక్తి అన్నీ ఒకేసారి మనలో ఉప్పొంగుతాయి....
మన జీవితంలో కష్టాలు గుర్తుకు వస్తాయి, ఆ శివ చెయ్యి మనంకూడా పట్టుకొని "దేవత"భరోసా పొందినట్టు అనుభూతికి లోనవుతాం!
మీరు తప్పక చూడండి....... ఈ రైటప్ మళ్ళీ చదవండి!
రిషబ్ లాంటి వజ్రాల గనుల వైతాళికులు ప్రతి రంగంలో ఎందరో ఉన్నారు... వాళ్ళిలా తవ్వి తీసి కుప్పలు పోసినంత కాలం... భారత హైందవ సంస్కృతి, సనాతన హిందూ ధర్మం, భారతదేశ ఖ్యాతి కి ఏ లోటు ఉండదు!!!
-ఈ చిత్రానికి, కథకు, దర్శకునికి, హీరో కు (ఆంటే నాలుగుసార్లు రిషబ్ కే), సంగీత దర్శకునికి, నేషనల్ అవార్డ్స్ వస్తే ఒక్క శాతం కూడా ఆశ్చర్యపోను.
16 కోట్లతో తీసిన ఈ చిత్రం 250 కోట్లు దాటి, పరుగులు తీస్తున్నదంటే,...నాకొకటే అనిపిస్తున్నది... రాసేదెవరు? రాయించేదెవరు? రిషబ్ కాదు... ఆ "తల్లే"!
చదివినందుకు ధన్యవాదాలు!!! - -మాధవ్ K
Also Read: NBK 107 Vs Chiru 154 : ‘వీరయ్య’ను లేపారా? ఇద్దరు హీరోలున్నా బాలయ్య జోరుకు బేజార్?
Also Read: Varasudu: వారసుడు తెలుగు సినిమా కాదట.. దిల్ రాజుకు ముందుంది ముసళ్ళ పండుగ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook