Vikranth Rona Telugu Review: కిచ్చా సుదీప్ ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కన్నడ నాట సూపర్ స్టార్ క్రేజ్ అందుకున్న కిచ్చా సుదీప్ తర్వాత తెలుగులో మరికొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో కూడా మెరిశారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఆయన ఇప్పుడు పాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోణతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కేజిఎఫ్ దెబ్బతో కన్నడ సినిమా పరిశ్రమ క్రేజ్ కూడా అంతకంతకు పెరుగుతూ వెళ్లిన క్రమంలో ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది సినిమాకి సంబంధించిన రివ్యూలో చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విక్రాంత్ రోణ కథ ఏమిటంటే:
ఈ సినిమా మొత్తం కూడా కొమరట్టు అనే ఒక అటవీ ప్రాంతంలో ఏర్పడిన ఒక గ్రామం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ ఊరిలో ఒక పాడుబడిన ఇల్లు, ఆ ఇంట్లో ఒక బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడని ఊరి వారందరూ నమ్ముతూ ఉంటారు. ఊరిలో వరుసగా పిల్లలు హత్య చేయబడుతూ ఉంటారు. వారందరూ కూడా అడవిలో చెట్లకు వేలాడదీయబడుతూ ఉంటారు. ఇదంతా కూడా ఆ బ్రహ్మ రాక్షసుడి పని అని ఆ ఊరి వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ హత్యల వెనక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక పోలీసు అధికారిని పంపితే ఆ అధికారి కూడా అదే ఇంటిలోని బావిలో శవమై కనిపిస్తాడు. ఇక ఆ తర్వాత అతని స్థానంలో విక్రాంత్ రోణ(కిచ్చా సుదీప్) ఎంట్రీ ఇస్తాడు. ఈ నేపథ్యంలో విక్రాంత్ రోణ ఈ హత్యలకు గల కారణం ఏమిటి అనేది ఎలా కనుక్కున్నాడు? నిజంగా ఈ హత్యలకు ఎవరు కారణమనేది కనుక్కున్నాడా లేదా? అనేది సినిమా కథ.


విశ్లేషణ:
కన్నడ సినిమా పరిశ్రమను లో బడ్జెట్ అంటూ చూసే కోణం మారింది. ఈ నేపథ్యంలోనే విక్రాంత్ రోణ సినిమాకి కూడా భారీ బడ్జెట్ తో విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో కథనం విషయంలో కాస్త ఇబ్బంది పడడంతో అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు అనే విషయం ప్రేక్షకులకు అర్థం కాదు. సినిమా చూసిన చాలాసేపటి వరకు కూడా సినిమా కథ ఏమిటి అనేది అర్ధం కాదు.  సినిమాలో లీనమయ్యే విధంగా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యారు. అయితే సాదాసీదాగానే సాగిపోయినా విజువల్ ఎఫెక్ట్స్ తో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సాధారణ థ్రిల్లర్ ఫార్మాట్ లోనే ఈ సినిమా కూడా ఉంటుంది. పెద్దగా ట్విస్టులకు ఏమీ చోటు లేకుండానే సినిమా సాగిపోతుంది. ఎక్కడికక్కడ దర్శకుడు సరిగా ప్లాన్ చేసుకున్నారు. విక్రాంత్ రోణ ఎంట్రీ దగ్గర నుంచి సినిమా మీద ఒక్కసారిగా ఆసక్తి పెరుగుతుంది. ఆయన కేసు డీల్ చేసే విధానం మొదలు క్లైమాక్స్ వరకు ఆసక్తికరంగా చూపించే విధంగా ప్రయత్నించి కొంతమేర సఫలం అయ్యారు. 
 
నటీనటుల విషయానికి వస్తే: 
ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే విక్రాంత్ రోణ పాత్రలో నటించిన కిచ్చా సుదీప్ తన పాత్రలో పూర్తిగా లీనమయ్యాడు. ఈ పాత్రలో ఆయన తప్ప మరొకరు ఇమిడలేరు అనే అంతగా ఆయన నటించి ఒక రకంగా చెప్పాలంటే జీవించి మెప్పించారు. ఇక అలాగే ఆయన తర్వాత నిరూప్ బండారి పాత్రకు కూడా కొంతమేర నటించే అవకాశం దొరికింది. అలాగే రక్కమ్మ అనే పాత్రలో కొంచెం సేపే కనిపించినా సరే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తనదైన సోయగాలతో ఆకట్టుకుంది ఇక మధుసూదన్ రావు లాంటి వారు ఎప్పటిలాగే నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మొత్తం మీద విక్రాంత్ రోణ అనే సినిమా కిచ్చా సుదీప్ వన్ మాన్ షో అని చెప్పవచ్చు.


టెక్నీషియన్స్ 
ఇక ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ విషయానికి వస్తే దాదాపుగా ఈ సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ అందరూ ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా దర్శకుడు కథ బాగా రాసుకున్నారు కానీ కథనం విషయంలోనే కాస్త ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసేసినట్టు అనిపిస్తుంది. క‌థ‌లో అన‌వ‌స‌ర‌మైన పాత్రలను త‌గ్గించి మ‌రిన్ని ట్విస్ట్‌లు కనుక జొప్పించి ఉంటె సినిమాను సినిమా మ‌రో స్థాయిలో ఉండేదేమో. ముఖ్యంగా శివ కుమార్ ఆర్ట్ వ‌ర్క్ ప్రేక్షకుల్ని పాతికేళ్ల వెనక్కు ఒక అటవీప్రాంతానికి తీసుకువెళ్లిన ఫీలింగ్ కలిగేలా చేసింది. అజ‌నీష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలాగే విలియం కెమెరాపనితనం సినిమాకి మ‌రింత ప్లస్ అయ్యాయి. నిర్మాణ విలువ‌లు కూడా సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఎడిటింగ్ టేబుల్ మీద కూడా కాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కూడా సినిమాను మరో లెవల్ కి తీసుకువెళ్తాయి. ఎక్కడా కూడా తగ్గకుండా ఖర్చుకు వెనకాడకుండా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా చూపించారు. 
  
ఫైనల్ గా:
ఇక ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే విక్రాంత్ రోణ సినిమా కేజిఎఫ్ స్థాయిలో ఉంటుందని ముందు నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆ మేర లేకపోయినా కచ్చితంగా కుటుంబ సభ్యులతో కలిసి ఒకసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడగలిగే సినిమా.


విక్రాంత్ రోణ రేటింగ్: 2.75/5


న‌టీన‌టులు: కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌, మ‌ధుసూద‌న‌రావు త‌దిత‌రులు 
సంగీతం: అజ‌నీష్ లోక‌నాథ్
ద‌ర్శక‌త్వం: అనూప్ భండారి 
నిర్మాతలు: జాక్ మంజునాథ్‌, అలంకార్ పాండియ‌న్‌


Also Read: Vikrant Rona: కిచ్చా సుదీప్ పాన్ ఇండియా 'విక్రాంత్ రోణ' ఎలా ఉందో తెలుసా?


Also Read: Avika Gor: బికినీలో దర్శనం ఇచ్చిన అవికా గొర్.. నెవర్ బిఫోర్ అనిపించేంతలా అందాల విందు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.