ఆయన ఆంగికం హాస్యం.. ఆయన అభినయం హాస్యం.. ఆయన ఆహార్యం హాస్యం.. అంతెందుకు ఆయన రూపమే ఒక హాస్యనటనా వైభవం.. దక్షిణ భారతంలో వరుసగా ఏడుసార్లు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్న మేటి హాస్యదిగ్గజం ఆయన. తెలుగు సినీ పరిశ్రమలో ఒక చరిత్రను తిరగరాసిన హాస్యనటుల జాబితాను తయారుచేస్తే.. అందులో ఆయన పేరు అగ్రస్థానంలో ఉంటుందన్న విషయంలో అతిశయోక్తి లేదు. ఆయనే చిత్రసీమలో నవ్వుల నవాబు అన్నదగ్గ మేటి నటుడు రాజబాబు. ఆయన జయంతిని పురస్కరించుకొని రాజబాబు జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం


  • రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. 20, అక్టోబరు, 1935 తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురంలో జన్మించిన ఆయన చిన్నప్పుడే బుర్రకథను నేర్చుకొని ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు సాహిత్యమంటే విపరీతమైన అభిమానంతో పండిట్ కోర్సు చేసి కొన్నాళ్లు ఉపాధ్యాయుడిగా కూడా సేవలందించారు రాజబాబు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పుడే నాటకాలు కూడా వేసేవారు.


  • ఓసారి ఓ నాటక ప్రదర్శనలో రాజబాబును చూసిన సినీ దర్శకుడు గరికపాటి రాజారావు, అతన్ని సినిమాలలో చేరమని ప్రోత్సహించారు. సినిమాల్లో చేరడానికి మద్రాసు వచ్చిన రాజబాబు పూట గడవడం కోసం, మరో నటుడు అడ్డాల నారాయణరావు ఇంట్లో వారి పిల్లలకు పాఠాలు చెప్పేవాడు.


  • రాజబాబు నటించిన తొలి సినిమా "సమాజం". కొన్ని సినిమాలు ఎలాంటి పారితోషికం లేకుండానే నటించిన రాజబాబు, స్వర్ణగౌరి అనే చిత్రానికి 350 రూపాయల చెక్కును తొలిసారిగా అందుకున్నాడు. చిత్రసీమలో అదే అతని తొలి సంపాదన.


  • రాజబాబు దశను తిప్పిన చిత్రం వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మాణంలో వచ్చిన "అంతస్తులు". ఈ చిత్రానికి అప్పట్లోనే అత్యధికమైన 1300 రూపాయలను పారితోషికంగా అందుకున్నారు రాజబాబు.


  • రాజబాబు హీరోగా నటించిన తొలి చిత్రం "తాతా మనవడు".  ఆ సినిమా తర్వాత  పిచ్చోడి పెళ్ళి, తిరుపతి, ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు లాంటి సినిమాలలో కూడా హీరోగా నటించాడు.


  • రాజబాబు స్వయంగా బాబ్ & బాబ్ ప్రొడక్షన్స్ అన్న నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించి పలు చిత్రాలు కూడా నిర్మించారు. సినీరంగంలో అత్యున్నత స్థానానికి ఎదిగినా, ఎప్పుడూ తనకు కూడు పెట్టిన నాటకాలను మరిచిపోలేదు రాజబాబు. రాజబాబు పబ్లిక్‌ ట్రస్ట్‌ ఒకటి స్థాపించి ప్రతీ సంవత్సరం మూడు రోజులు నాటక పోటీలు పెట్టి బహుమతులు అందించేవారు. 


  • ప్రముఖ కవి శ్రీశ్రీకి రాజబాబు మేనల్లుడు. శ్రీశ్రీ చెన్నై వచ్చేటప్పుడు వీరిద్దరూ టయోటా కారులో కలిసి తిరిగేవారట. 


  • 20 ఏళ్ళలో దాదాపు 589 సినిమాల్లో నటించిన రాజబాబుకి జంటగా 250 సినిమాల్లో నటి రమాప్రభ నటించడం విశేషం.  రాజబాబు కెరీర్‌లో వరుసగా ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు, మూడు నంది పురస్కారాలు కూడా అందుకున్నారు. 


  • ఓ సారి రాజమండ్రిలో చెత్తచెదారాలు ఊడ్చే కార్మికులతో మాట్లాడుతున్న సందర్భంలో వారికి సొంత ఇళ్లు లేవనే విషయం తెలిసి రాజబాబు ఎంతో బాధపడ్డారట. వెంటనే దానవాయిపేటలో ఉన్న తన స్థలంలో వారిని ఇళ్ళు కట్టుకోమన్నారట. అలాగే కోరుకొండ ప్రాంతంలో ఒక జూనియర్ కళాశాలను కూడా నిర్మించారు రాజబాబు. 


  • రాజబాబు తన కెరీర్ చివరిదశలో బాగా అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్‌లోనే ఫిబ్రవరి 14, 1983 తేదీన తెలుగు సినీ అభిమానుల్ని శోక సముద్రంలో ముంచి స్వర్గస్తులయ్యారు.


  • ఏదేమైనా.. తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన హాస్యశైలికి రూపకల్పన చేసి, మంచి కామెడీతో లెక్కలేనంతమంది అభిమానులను సంపాదించుకున్న రాజబాబు నిజంగానే గ్రేట్ లెజెండ్ ఆఫ్ టాలీవుడ్ కామెడీ అనవచ్చు. అందుకేనేమో.. అతన్ని తెలుగు సినీ జగత్తులో శతాబ్ది హాస్యనటుడు అంటారు.