Movie Ticket Rates in Andhra Pradesh and Telangana: వందకోట్ల క్లబ్.. రెండొందల కోట్ల క్లబ్.. సౌతిండియా స్టార్.. పాన్ ఇండియా స్టార్.. మా హీరో ఆ రికార్డు బ్రేక్ చేశాడు. మా డైరక్టర్ ఎవరికీ సాధ్యంకాని వసూళ్లను కొల్లగొట్టాడు. ఇవన్నీ వినడానికి బాగానే ఉన్నా... దీని వెనక అందరికీ తెలిసిన మరో బాధాకరమైన కోణం మాత్రం వెలుగులోకి రావడం లేదు. సినీ ఇండస్ట్రీ  రికార్డుల కోసం సామాన్యుడు బలవుతున్నాడు. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న మధ్య తరగతి వాళ్లకు ఇప్పుడు సినీ వినోదం అందని ద్రాక్షగా మారిపోయింది. ఎడాపెడా పెరుగుతూ పోతున్న టికెట్ల రేట్లు వారి జేబులను గుల్లచేస్తున్నాయి. కొత్త సినిమా రిలీజైన మొదటి పది రోజులైతే థియేటర్ వైపు వెళ్లాలంటేనే కాళ్లలో వణుకుపుడుతోంది. ఓ వైపు కుటుంబానికి కొత్త సినిమా చూపించి సంతోషపెట్టాలనే ఆశ.. మరోవైపు పెరిగిన టికెట్ల రేట్లతో బడ్జెట్ తారుమారవుతుందనే భయం మధ్య మధ్యతరగతి వ్యక్తి నలిగిపోతున్నాడు. భారీ బడ్జెట్ మూవీ రిలీజైన మొదటి వారం పది రోజుల పాటు టికెట్ల రేట్ల పెంపుకు తెలుగు ప్రభుత్వాలిచ్చిన జీవోలు మధ్యతరగతి ప్రజలకు మాత్రం శరాఘాతంగా మారాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ సందర్భంగా తెలంగాణ , ఏపీ ప్రభుత్వాలు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతిచ్చాయి. దీనికోసం ప్రత్యేకంగా జీవోలు జారీచేశాయి. తెలంగాణలో సాధారణ థియేటర్లలో మొదటి 3 రోజుల వరకు టికెట్‌పై 50 రూపాయలు, ఆ తర్వాత  వారం వరకు రూ. 30 పెంచుకునే వెసులుబాటును కల్పించారు. మల్టీప్లెక్స్‌లలో మొదటి మూడు రోజులకు రూ.100, ఆ తర్వాత వారం రోజులకు రూ.50 మేర పెంచుకునే అవకాశమిచ్చారు. అలాగే, మార్చి 25 నుంచి 10 రోజుల పాటు థియేటర్లలో రోజుకు ఐదు షోలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇక ఏపీలోనూ మొదటి పది రోజుల పాటు అన్ని రకాల థియేటర్లలో టికెట్లపై 75 రూపాయల వరకు పెంచుకునేందుకు అవకాశమిచ్చారు.


రెండు ప్రభుత్వాలు ఎంతో పెద్దమనసుతో ఇచ్చిన జీవోలు మధ్యతరగతి, పేదవర్గాలకు సినీ వినోదాన్ని దూరం చేస్తున్నాయి. ఎబో మిడిల్ క్లాస్ ను కూడా టికెట్ల రేట్లు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. హైదరాబాద్ లో ఉండే వారికి మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలనేది ఓ కల. కానీ ఈ కల నెరవేడరం ఇప్పుడు కష్టసాధ్యంగా మారింది. హైదరాబాద్ లోని మల్లీప్లెక్స్‌లలో ట్రిపుల్ఆర్ మూవీ టికెట్ రేట్లు మొదటిమూడు రోజుల గరిష్టంగా 470 రూపాయల దాకా ఉంది. కనీసం  410 రూపాయలు పెడితే కానీ మల్టీప్లెక్స్ లో టికెట్ కొనే పరిస్థితి లేదు. ఇక సిటీలోని మామూలు ఏసీ థియేటర్లలో టికెట్ల రేట్లు 235 రూపాయల వరకు ఉన్నాయి. కనీసం 150 పెడితేకానీ కిందవరుసల్లో కూర్చొని సినిమా చూడలేం. ఆ తర్వాత కూడా మరో వారం పాటు కొంచెం అటూ ఇటుగా ఇవే రేట్లు ఉంటాయి. ఇక ఏపీలో తెలంగాణతో పోల్చితే టికెట్ల రేట్లు కాస్త తక్కువనిపిస్తున్నా... అవికూడా జేబులను గుల్లచేసేవే. అక్కడ మల్టీప్లెక్స్ టికెట్ రేట్ 380 రూపాయలుంది. 


కనీస టికెట్ రేట్ కూడా 150 రూపాయలుంది. ఏసీ థియేటర్లలో 150 నుంచి 205 రూపాయల దాకా ఉంది. సినిమాపై ఉండే క్రేజ్ ను మొదట్లోనే క్యాష్ చేసుకునేందుకు సినీ ఇండస్ట్రీకి ఇలా ప్రభుత్వాలే అడ్డగోలు పర్మిషన్లు ఇస్తున్నాయి. ఈ రేట్లకు తోడు పార్కింగ్ కోసం 20 నుంచి 50 రూపాయలు చేతి చమురు వదులుతుంది. ఇక సినిమా బ్రేక్ టైమ్ లో  థియేటర్ల నిలువు దోపిడీ అందరికీ తెలిసిందే. సరదాగా పిల్లలకు పాప్ కార్న్ ఇప్పించాలన్నా ఓ ఐదొందల నోటు బయటకు తీయాల్సిందే. సమోసా 30 రూపాయలు, ఎగ్‌పఫ్ 50 రూపాయలు. కూల్‌డ్రింక్ 70 నుంచి వంద రూపాయలు. రిలీజైన కొత్త భారీ బడ్జెట్ సినిమాకు వెళ్లాలంటే నలుగురు సభ్యులున్న ఓ ఫ్యామిలీ కనీసం రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది మధ్యతరగతివారికి మోయలేని భారంగా తయారైంది.  ఈ దోపిడీని అరికట్లే నాథుడే లేకుండా పోయాడు.  థియేటర్ల దోపిడీపై సామాన్యులు ఎంత గొంతుచించుకున్నా ప్రయోజనం శూన్యం. దీన్ని అరికట్టాల్సిన ప్రభుత్వాలు కూడా కళ్లుమూసుకున్నాయి. సినిమా వినోదం అనేది సామాన్యుడికి అందని ద్రాక్షగా మారింది. సినీ ఇండస్ట్రీ గురించి ఆలోచించే ప్రభుత్వాలు.. సామాన్యజనం గురించి కూడా ఆలోచిస్తేనే ఈ దోపిడీకి అడ్డుకట్టపడుతుంది.


Also Read: China Flight Crash: చైనా విమాన ప్రమాదంలో ఎవరూ బతకలేదా..కొండపై చెలరేగుతున్న మంటలు


Also Read: Shabaash Mithu Teaser: శభాష్‌ మిథు టీజర్ వచ్చేసింది.. బ్లూ జెర్సీలో మెరిసిన తాప్సీ! రవిశాస్త్రి అదుర్స్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook