సెన్సార్ పూర్తి చేసుకున్న `ఆఫీసర్`
నాగ్ సినిమాకు U/A సర్టిఫికెట్
నాగార్జున తర్వాతి సినిమా ఆఫీసర్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. 'ఆఫీసర్'ను వీక్షించిన సెన్సార్ బోర్డ్ సభ్యుల బృందం సినిమాకు U/A సర్టిఫికెట్ కేటాయించింది. ముంబైలోని నేరసామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాడు. శివమణి తర్వాత మళ్లీ చాలా కాలానికి నాగ్ పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్న సినిమా ఇది. అన్నింటికిమించి రాంగోపాల్ వర్మ-నాగ్ ఇద్దరూ రెండున్నర దశాబ్ధాల తర్వాత మళ్లీ కలిసి పనిచేసిన సినిమా కూడా ఇదే కావడంతో ఆఫీసర్ సినిమాపై నాగ్ అభిమానుల్లో భారీ అంచనాలే వున్నాయి. వాస్తవానికి మే 25నే రిలీజ్ కావాల్సి వున్న ఈ సినిమా పలు అనుకోని కారణాలతో జూన్ 1న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది.
సుధీర్ చంద్ర, రాంగోపాల్ వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆఫీసర్ సినిమాలో నాగ్ సరసన మైరా సరీన్ జంటగా నటిస్తోంది. నాగార్జున ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఈ సినిమా ద్వారా మళ్లీ తనను తాను కొత్తగా సృష్టించుకున్నాను అని ఆ సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ అభిప్రాయపడటం చూస్తోంటే అతడికి 'ఆఫీసర్'పై ఎన్ని అంచనాలు వున్నాయో ఇట్టే అర్థమైపోతోంది.