నేడు తమిళనాడులో భారీ అభిమాన బలగాన్ని సొంతం చేసుకున్న తమిళ తళైవా పుట్టి, పెరిగింది పెద్ద పేరున్న, బాగా డబ్బున్న కుటుంబంలో ఏమీ కాదు!! ఆ మాటకొస్తే, రజినీకాంత్ స్వస్థలం కూడా తమిళనాడు కాదు..!! కానీ తమిళతంబీలకి ఇప్పుడు ఆయన మరో రాజకీయ ప్రత్యామ్నాయం. తళైవానే తమ తలరాతలు మారుస్తాడని వాళ్లు బలంగా నమ్మేంత బలమైన స్థానం. కానీ తళైవాకు ఇప్పుడు ప్రజల హృదయాల్లో వున్న స్థానం, హోదా ఏమీ అంత ఈజీగా వచ్చింది కాదు!! సూపర్ స్టార్ అనే హోదా వెనుక ఎంతో శ్రమ, కృషి దాగి వున్నాయి. అన్నింటికిమించి జీవితంపై కసి పెంచిన కడు పేదరికం, తాను నమ్ముకున్న కళపై ప్రాణం.. ఆయన తనని తాను ఊహించని స్థాయికి చేర్చింది. అదే ఇవాళ కోట్లాది మంది తమిళుల హృదయాల్లో తళైవాగా చెరగని ముద్ర వేసుకునేలా చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి తమిళ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన రజినీకాంత్ తన బాల్యంలోనే ఎన్నో కష్టాలు పడ్డాడు. 1950లో డిసెంబర్ 12న కర్ణాటకలో జన్మించిన రజినీకాంత్ అసలు పేరు శివాజీ రావ్ గైక్వాడ్. మహారాష్ట్రకు చెందిన శివాజీ రావ్ గైక్వాడ్‌కి ఐదేళ్లు వున్నప్పుడే అతడి తల్లి ఈ లోకాన్నీ విడిచివెళ్లిపోయింది. చిన్న తనంలోనే తల్లిని పోగొట్టుకున్న శివాజీ రావ్ గైక్వాడ్ అప్పటి నుంచే అమ్మ ప్రేమకు దూరమయ్యాడు. 


శివాజీ రావ్ గైక్వాడ్ తండ్రి కర్ణాటక పోలీసు శాఖలో ఓ కానిస్టేబుల్‌గా పనిచేస్తుండే వారు. తండ్రిది చిరుద్యోగం కావడంతో కుటుంబం కోసం ఎన్నో కష్టాలు పడిన శివాజీ.. చివరగా కర్ణాటక ఆర్టీసీలో ఓ బస్ కండక్టర్ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. చేసేది బస్ కండక్టర్ ఉద్యోగం అయినా... అతడి ధ్యాస అంతా నటనపైనే వుండేది. బస్సులో విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనూ నటనపై తనకి వున్న ఆసక్తిని కనబర్చే శివాజీ రావ్ గైక్వాడ్ అంటే ఆయన డ్యూటీ చేస్తున్న బస్సులో ప్రయాణించే ప్రయాణికులకి కూడా ఇష్టమే. అందుకే ఆ రోజుల్లో శివాజీ రావ్ గైక్వాడ్ సూపర్ స్టార్ కాకపోయినా.. అతడు వున్న బస్సులోనే ప్రయాణించి అతడి సరదా చేష్టలు చూడటం కోసం ఎన్నో బస్సులు ఖాళీగా వెళ్తున్నప్పటికీ అవి ఎక్కేవారు కాదట ఆ రూట్‌లో ప్రయాణించే ప్రయాణికులు. ముఖ్యంగా శివాజీ రావ్ గైక్వాడ్ బస్సులో ప్రయాణికులకి తనదైన స్టైల్లో చిల్లర తిరిగి ఇచ్చే విధానం ప్రయాణికులని బాగా ఆకట్టుకునేదట. 


RAJINIKANTH`S POLITICAL ENTRY CONFIRMED: CLICK HERE TO READ THIS ARTICLE


శివాజీ రావ్ గైక్వాడ్ జీవితం మలుపు తిరిగింది కూడా ఇక్కడే. అతడికి నటనపై వున్న అభిరుచి, ఆసక్తి గమనించిన మిత్రుడైన సహోద్యోగి 1973లో అతడికి కొంత ఆర్థిక సహాయం అందించి మద్రాసులో ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేరాల్సిందిగా పంపించడం, అదే సమయంలో మద్రాసులో శివాజీ రావ్ గైక్వాడ్ నటించిన ఓ నాటిక ప్రముఖ దర్శకుడు కే బాలచందర్ కంట్లో పడటం వెనువెంటనే జరిగిపోయాయి. శివాజీ రావ్ గైక్వాడ్ ప్రతిభని గుర్తించిన కే బాలచందర్ అతడికి తన తర్వాతి సినిమాలో మొట్టమొదటి అవకాశం కల్పించారు. 


1975లో 'అపూర్వ రాగంగల్' అనే తమిళ సినిమాలో ఓ క్యాన్సర్ పేషెంట్ పాత్రలో శివాజీ నటించిన సినిమా తన సినీ కెరీర్‌కి గట్టి పునాది వేసింది. ఆ సినిమాలో చేసింది ఓ చిన్న పాత్రే అయినా.. ఆ పాత్రే అతడికి మరిన్ని అవకాశాలని తెచ్చిపెట్టింది. అపూర్వ రాగంగల్ సినిమాలో రజినీకాంత్ నటన చూసి ఇంప్రెస్ అయిన బాలచందర్ తన తర్వాతి సినిమాలో ఈసారి పూర్తిస్థాయి హీరో వేషం ఇచ్చారు. ఆ సినిమా కూడా రజినీకాంత్‌కి హీరోగా బాగా పేరు తీసుకొచ్చింది. 


ఈ సినిమాలో యంగ్ హీరో పాత్రకు బాలచందర్ పెట్టిన పేరే రజినీకాంత్. ఆ సినిమా తర్వాత శివాజీ రావ్ గైక్వాడ్ కాస్తా రజినీకాంత్ అయ్యాడు. అది మొదలు ఇక రజినీకాంత్ వెనుతిరిగి చూసింది లేదు. గురువు బాలచందర్‌తోపాటు భారతీరాజా లాంటి ఇంకెందరో అగ్రదర్శకులతో కలిసి పనిచేసి తమిళ ఆడియెన్స్‌కి బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించారు. అలా వారి హృదయాల్లో సుస్థిర స్థానం సొంతం చేసుకుని సూపర్ స్టార్ అయ్యారు రజినీకాంత్. 


తమిళతంబీల హృదయాల్లో తళైవాగా ముద్రపడిన రజినీకాంత్ తాను రాజకీయాల్లోకి వస్తున్నాని ప్రకటించడమే కాకుండా 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాకపోయినా.. తన వంతు కర్తవ్యం తాను నిర్వర్తిస్తానని ప్రకటించారు సూపర్ స్టార్. 


ఒకవేళ అధికారంలోకి వస్తే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడేళ్లలోపు ఎన్నికల హామీలని నెరవేర్చలేకపోతే, తానే రాజీనామా చేసి పక్కకు తప్పుకుంటానని స్పష్టంచేయడం సూపర్ స్టార్‌కి తనపై తనకి వున్న నమ్మకాన్ని స్పష్టంచేస్తోంది. 2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై తగిన సమయంలో స్పందిస్తాం అని తన ప్రకటనలో పేర్కొన్నారు సూపర్ స్టార్. మరి సూపర్ స్టార్ ఆశించినట్టుగా, అతడి అభిమానులు కోరుకుంటున్నట్టుగా తమిళనాడు తర్వాతి ముఖ్యమంత్రి ఆయనే అవుతారా అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి!! లెట్స్ వెయిట్ అండ్ సీ!!