Ranga Ranga Vaibhavanga Movie Telugu Review: మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. వారిలో వైష్ణవ్ తేజ్ మొట్టమొదటి సినిమా ఉప్పెనతోనే హిట్ అందుకున్నాడు. తర్వాత కొండపొలం అనే ప్రయోగాత్మక సినిమాలో కూడా హీరోగా నటించిన మూడో సినిమా రంగ రంగా వైభవంగా. తమిళ అర్జున్ రెడ్డి రీమేక్ సినిమా తెరకెక్కించిన గిరీశాయ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. రొమాంటిక్ భామ కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నుంచి విడుదలైన కొన్ని పాటలు, ట్రైలర్, టీజర్ సినిమా మీద ఆసక్తి పెంచాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా ? లేదా? అనే విషయంలోకి వెళితే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రంగ రంగ వైభవంగా కథ విషయానికి వస్తే:
రాముడు(ప్రభు), చంటి(సీనియర్ నరేష్) అనే ఇద్దరు స్నేహితులు చిన్ననాటి నుంచి అన్ని విషయాలలో తోడు నీడగా ఉంటూ ఉంటారు. విశాఖపట్నంలో పక్కపక్కనే రెండు ఒకే లాంటి ఇల్లు కట్టుకుని స్థిరపడతారు. వారి స్నేహంలాగానే వారి పిల్లలు కూడా చాలా స్నేహంగా ఉంటారు. రాముడు చిన్న కుమార్తె రాధ(కేతిక శర్మ) చంటి చిన్న కుమారుడు రిషి(వైష్ణవ్ తేజ్) చిన్నప్పుడు స్కూల్లో ఒక చిన్న గొడవ వల్ల మాట్లాడుకోకుండానే ఉంటారు. పక్కపక్క ఇళ్లలోనే ఉంటూ రోజూ కలుసుకుంటూనే ఉన్నా ఇద్దరూ మాట్లాడుకోకుండానే కాలం నడిపిస్తూ ఉంటారు.అలా పదేళ్లు గడిపేస్తారు. ఇద్దరు కూడా డాక్టర్ కోర్స్ చదువుతున్న సమయంలో ఒక అనుకొని పరిణామములు మళ్ళీ ఒక్కటవుతారు. ఇక కలిసిపోయాం నెక్స్ట్ పెళ్లే అనుకుంటున్న తరుణంలో రెండు కుటుంబాల మధ్య దూరం పెరుగుతుంది. ఆ దూరం పెరగడానికి కూడా ఆ రెండు కుటుంబాల్లో వ్యక్తులే కారణమవుతారు. చివరికి ఈ రెండు కుటుంబాలు కలుస్తాయా? హీరో హీరోయిన్ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా అనేదే సినిమా కథ. 


విశ్లేషణ:
రంగ రంగ వైభవంగా అనేది ఒక ఫ్యామిలీ మెలో డ్రామా. దానికి ఒక లవ్ స్టోరీ కూడా కలిపాడు దర్శకుడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఈ కథ ఇంతకుముందు ఎప్పుడో చూసినట్టు ఉందే అనిపిస్తూ ఉంటుంది. గతంలో అనేక సినిమాల్లో చూసిన కథని మళ్లీ రంగ రంగ వైభవంగా సినిమాలో కూడా రిపీట్ చేశారు. ఇద్దరు స్నేహితుల కుటుంబాలు చాలా క్లోజ్ గా ఉండడం, వారి పిల్లల ప్రేమలో పడటం, అయితే అసలు ఏమీ సమస్య లేదనుకుంటున్న సమయంలో కూడా చిన్న కారణంతో రెండు కుటుంబాలు దూరం అవ్వడం, ఆ తర్వాత ఆ కుటుంబాల్లోని హీరో హీరోయిన్లు తమ తమ కుటుంబాలను ఎలా కలుపుకున్నారు అనే కధ ఇప్పటికే మనం చాలా సినిమాల్లో చూసాం. దానిని తనదైన స్టైల్ లో చూపించేందుకు ప్రయత్నం చేశాడు గిరీశాయ. అయితే అందులో పూర్తిగా సఫలం కాలేకపోయాడు సినిమా ఆద్యంతం కూడా నవ్వులతో నడిపించడానికి గిరీశాయ. విశ్వ ప్రయత్నం చేశారు. అయితే కొన్నిచోట్ల అది ఎబ్బెట్టుగా కూడా అనిపిస్తుంది.  


నటీనటుల విషయానికి వస్తే:
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవ్ తేజ్ నటన తన గత సినిమాల కంటే కొంచెం మెరుగయింది. అయితే ఆయన ప్రయత్నిస్తున్నాడో లేక ప్రేక్షకులకు అలా అనిపిస్తుందో తెలియదు కానీ తన చిన్న మేనమామ పవన్ కళ్యాణ్ అలాగే తన సోదరుడు సాయి ధరంతేజ్ ని ఇమిటేట్ చేస్తున్న ఫీలింగ్ ఎక్కువగా కలుగుతుంది. నటన పరంగా కామెడీ టైమింగ్ పరంగా వైష్ణవ్ తేజ్ లో మంచి స్పార్క్ ఉంది. కాకపోతే సోదరుడుని, మామయ్యను ఇమిటేట్ చేస్తున్నాడనే ముద్ర తప్పించుకోగలిగితే మరింత బాగుంటుంది. ఇక హీరోయిన్ కేతిక శర్మకి కూడా ఇది మూడో సినిమా అయినా ఆమె కూడా నటనలో మరింత మెరుగవాల్సింది. ఇక సినిమాలో నటించిన ప్రభు, సీనియర్ నరేష్, ప్రగతి, సీత వంటి వారు తమ పాత్రల పరిధి మీద నటించే ఆకట్టుకున్నారు. సుబ్బరాజు, నవీన్ చంద్ర ఇద్దరికీ మంచి రోల్స్ దక్కాయి. నాగబాబు ఒకటి రెండు సీన్లలో కనిపించి ఆకట్టుకున్నాడు. కార్తీకదీపం సీరియల్ ఫేమ్ డాక్టర్ బాబు కనిపించింది ఒక్క సీన్ లోనైనా అందరితో విజిల్స్ వేయించుకున్నాడు.


టెక్నికల్ టీమ్
టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే కథలో ఎలాంటి కొత్తదనం లేదు కాబట్టి దర్శకుడు మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయత్నం కూడా కొంతవరకు సఫలమైంది. కాకపోతే ఒక్కోచోట కొన్ని సీన్లు ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. సంగీత దర్శకత్వం విషయంలో దేవిశ్రీప్రసాద్ ఆకట్టుకోలేకపోయారు. పాటలు అన్నీ ఆకట్టుకోలేకపోయినా ఒకటి రెండు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ సినిమాకు అందాన్ని తీసుకొచ్చింది. ఎడిటింగ్ కూడా ఎక్కడికక్కడ సరిగ్గా సెట్ అయింది. ఎక్కడా అనవసరపు సీన్లు చూపించిన దాఖలాలు అయితే లేవు. ఇక నిర్మాణ విలువలు కూడా బీవీఎస్ఎన్ ప్రసాద్ అనుభవానికి తగినట్లుగా చక్కగా సరిపోయాయి.


ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలంటే
సినిమాలో ఒక సాంగ్ ఉంది. హీరో: "కొత్తగా లేదేంటి కొత్తగా లేదేంటి" అంటూ అందుకుంటే హీరోయిన్ "ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి" అంటూ పాడుతుంది. సినిమా గురించి ఒక్క మాటలో వాళ్లే చెప్పేసుకున్నారు. ఒకరకంగా కొత్త సీసాలో పోసిన పాప సారానే అయినా వీకెండ్ మూవీ లవర్స్, టైం పాస్ కావాలనుకునేవారు చూసి ఆనందించదగిన సినిమా.


తారాగణం - వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ, నవీన్ చంద్ర, సత్య మరియు ఇతరులు
దర్శకుడు - గిరీశయ్య
నిర్మాత - బివిఎస్ఎన్ ప్రసాద్
నిర్మాణ సంస్థ - శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP
సంగీత దర్శకుడు - దేవి శ్రీ ప్రసాద్


రేటింగ్: 2.25/5