మలయాళంలో `సాయిపల్లవి` ఫిదా..!
వరుణ్ తేజ్, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన తెలుగు చిత్రం "ఫిదా" ఇప్పుడు మలయాళ ప్రేక్షకులను సైతం అలరించబోతోంది. ఇటీవలే ఈ మలయాళ వెర్షన్ ట్రైలర్ విడుదల అయ్యింది. తెలుగు నుండి మలయాళంలోకి డబ్ అవుతున్న "ఫిదా" చిత్రాన్ని ఆ భాషలో కూడా దిల్ రాజు స్వయంగా విడుదల చేయడం గమనార్హం. ఫిదా చిత్రానికి దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన "హ్యాపీడేస్" చిత్రం కూడా గతంలో మలయాళంలో డబ్ అయ్యింది. అక్కడ కూడా విజయం సాధించింది. ఇక సాయిపల్లవి మలయాళంలో నటించిన "ప్రేమమ్" ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు. ఈ క్రమంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన "ఫిదా" మలయాళ ప్రేక్షకులను ఎంత వరకు అలరిస్తుందో వేచి చూడాలి. "ఫిదా" మలయాళ చిత్ర ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా హిట్ అయ్యింది. దాదాపు 4 లక్షలమంది తొలిరోజే ఈ ట్రైలర్ వీక్షించారని అంచనా.