Chinmayi Sripaada: సింగర్ చిన్మయికి షాక్.. నామినేషన్ తిరస్కరణ!
Singer Chinmayi | మీటూ ఉద్యమంలో భాగంగా తమిళ సినీ ప్రముఖులపై సింగర్ చిన్మయి లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక అది మొదలుకుని డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయికి కష్టాలు మొదలయ్యాయి.
చెన్నై: డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ చిన్మయి శ్రీపాద #MeToo ఉద్యమంతో తమిళ ఇండస్ట్రీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. మరోసారి సింగర్ చిన్మయి తెరమీదకు వచ్చింది. తమిళ ఇండస్ట్రీలో డబ్బింగ్ యూనియన్ ఎన్నికలు అందుకు ఓ కారణమైతే.. అధ్యక్షుడు, నటుడు రాధారవిపై పోటీలో నిలిచింది చిన్మయి. మీటూ ఉద్యమంలో భాగంగా తన గళం విప్పిన చిన్మయి ప్రముఖ రచయిత వైరముత్తుతో పాటు నటుడు రాధారవిపై లైంగిక వేధింపుల ఆరోపణలు గుప్పించారు. డబ్బింగ్ యూనియన్ అధ్యక్ష పదవికి రామరాజ్యం పార్టీ తరఫున అధ్యక్ష పదవికి ఆమె నామినేషన్ దాఖలు చేశారు.
అనూహ్యంగా చిన్మయి నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో ఆమె షాక్ అయ్యారు. డబ్బింగ్ యూనియన్‌లో సభ్యురాలు కాని కారణంగా ఆమె నామినేషన్ తిరస్కరించినట్లు యూనియన్ చెబుతోంది. మరోవైపు చిన్మయి నామినేషన్ రిజెక్ట్ కావడంతో డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడిగా రాధారవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రచారం జరుగుతోంది. దీనిపై చిన్మయి ట్విట్టర్‌లో స్పందించారు. ‘రాధారవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారట. నా నామినేషన్ తిరస్కరించారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం డబ్బింగ్ యూనియన్‌లో నేను సభ్యురాలిని. ఎన్నికల అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని భావించాను. కానీ ఎవరి ఆదేశాలతో నేను సభ్యురాలిని కాదని ఎన్నికల అధికారి ప్రకటించారు. రాధారవి ఆదేశాలతోనేనా?’ అని చిన్మయి తన ట్వీట్ ద్వారా ప్రశ్నించారు.
తనను భాదపెడుతున్న వాళ్లు త్వరలోనే ఓడిపోబోతున్నారు. వాళ్లు అంతకు అంత అనుభవిస్తారు. యూనియన్ సభ్యులు నాకు సహకారం అందిస్తారని భావిస్తున్నాను. తాను సభ్యురాలిని కాదని పదే పదే చెబుతున్న నోటీస్ బోర్డు.. రిజెక్షన్ సర్టిఫికెట్‌లో నా మెంబర్‌షిప్ నెంబర్ (యూనియన్ సభ్యత్వ సంఖ్య)ను వెల్లడించినందుకు ధన్యవాదాలు అని వరుస ట్వీట్లు చేసింది డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి. కాగా, డబ్బింగ్ యూనియన్ ఎన్నికలు ఫిబ్రవరి 15న జరగనున్నాయి. మీటూ ఉద్యమంలో భాగంగా ఆరోపణలు చేసిన చిన్మయిని డబ్బింగ్ యూనియన్ సభ్యత్వం నుంచి గతంలో తొలగించారు. తనను యూనియన్ సభ్యురాలిగా పరిగణించాలని కోర్టు ఉత్తర్వులు తెచ్చుకుంది చిన్మయి.