రాజీవ్ కనకాల, శివబాలాజీ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న "స్నేహమేరా జీవితం" పాటలు (జ్యూక్ బాక్స్)ను ఈ రోజే యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ విషయాన్ని నటుడు శివబాలాజీ తన ఫేస్బుక్ ద్వారా పంచుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన థియాట్రికల్ ట్రైలర్ ఈ నెల 10వ తేదీన దుబాయ్‌లోని షేక్ రషీద్ ఆడిటోరియంలో విడుదల కానుంది. మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణరావు ఈ ఫంక్షన్‌కి అతిథులుగా రానున్నారు. శివబాలాజీ నిర్మాతగా వ్యవహరించబోయే చిత్రానికి మహేష్ ఉప్పుటూరి దర్శకత్వం వహించారు. గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు. సుష్మ అనే కొత్త హీరోయిన్ ఈ చిత్రం ద్వారా హీరోయన్‌గా పరిచయమవబోతోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్ర అధికారిక టీజర్‌ను సెప్టెంబరు 30వ తేదీన విడుదల చేశారు.