దుబాయ్‌లో హోటల్ గదిలో శ్రీదేవి మృతిచెందిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా శ్రీదేవి ప్రమాదవశాత్తుగా నీళ్లలో మునిగి మృతి చెందారు అంటూ అక్కడి ప్రభుత్వం డెత్ సర్టిఫికెట్ ఇవ్వడంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీదేవి మృతికి కారణం ఏంటనేది మాత్రమే డెత్ సర్టిఫికెట్‌లో వెల్లడించాల్సి వుంటుంది కానీ అది ప్రమాదవశాత్తుగా జరిగిందా లేక పథకం ప్రకారం జరిగిందా అనే క్లారిటీ దుబాయ్ వైద్య ఆరోగ్య శాఖ ఎలా తేల్చిచెబుతుందనే కొంతమంది వాదన. కేవలం నీళ్లలో మునగడం వల్లే శ్రీదేవి ప్రాణాలు కోల్పోయిందని చెప్పడం వరకు మాత్రమే డెత్ సర్టిఫికెట్ జారీ చేసే వారి విధి. ఆమె అలా బాత్రూమ్‌లో నిజంగానే ప్రమాదవశాత్తుగా నీళ్లలో మునగడం వల్ల చనిపోయిందా లేక ఇంకేమైనా కుట్ర జరిగిందా అనే మిగతా విషయాలన్నీ అక్కడి పోలీసులు చేపట్టే దర్యాప్తులో తేలుతుంది అనేది ఇంకొందరు వాదిస్తున్న అంశం. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 

అంతేకాకుండా, ఒకవేళ శ్రీదేవి మృతికి నీళ్లలో మునగడమే కారణం అయితే, అది ఆమె నీళ్లలో తడిసిపోయిన అవతారాన్ని చూసిన మొదటి క్షణంలోనే అర్థమైపోతుంది కదా! కానీ శ్రీదేవి విషయంలో అలా జరగలేదు. ఆమె గుండెపోటుతో చనిపోయింది అనేదే బయటి ప్రపంచానికి తెలిసిన విషయం. డెత్ సర్టిఫికెట్ జారీ అయ్యే వరకు మీడియా ప్రసారం చేసింది, జనం చెప్పుకున్నది కూడా అదే. కానీ డెత్ సర్టిఫికెట్‌లో పేర్కొన్న కారణం చూస్తేనే కొంచెం నమ్మశక్యంగా లేదంటున్నారు శ్రీదేవి అభిమానులు. ఈ వరుస పరిణామాలన్నీ పరిశీలిస్తోంటే, ఆమె మృతి వెనుకున్న అసలు కారణాన్ని బయటికి పొక్కకుండా తప్పుదోవ పట్టించే ప్రయత్నం ముందు నుంచే జరిగిందా అనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి.