విజేత మూవీ రివ్యూ
నటీనటులు – కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్, తనికెళ్ళ భరణి, మురళి శర్మ, నాజర్, సత్యం రాజేష్ తదితరులు
కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: రాకేష్ శశి
నిర్మాత: రజిని కొర్రపాటి
నిర్మాణం: సాయి కొర్రపాటి ప్రొడక్షన్
కెమెరామెన్: సెంథిల్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, రెహమాన్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
విడుదల తేదీ – జులై 12, 2018
మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో ముస్తాబయ్యాడు. కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన విజేత సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఓవైపు మెగా అల్లుడి ఎంట్రీ మూవీ. మరోవైపు సూపర్ హిట్ సినిమా టైటిల్. అన్నీ కలిపి విజేతను హాట్ టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మార్చేశాయి. మరి టైటిల్ తగ్గట్టు కల్యాణ్ దేవ్ విజేతగా నిలిచాడా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ
కథ
మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి శ్రీనివాసరావు (మురళీశర్మ). స్వతహాగా ఇతడు మంచి ఫొటోగ్రాఫర్. ఎలాగైనా అందరూ మెచ్చే ఫొటోగ్రాఫర్ అవ్వాలనుకుంటాడు. కానీ కుటుంబ బంధాలు, సమస్యలు ఇతడ్ని లక్ష్యానికి దూరం చేస్తాయి. అలా తన మనసుకు నచ్చిన పనిచేయలేకపోయిన శ్రీనివాసరావు, కొడుకును మాత్రం తనకు నచ్చిన కెరీర్ వైపు వెళ్లేలా చేయాలనుకుంటాడు.
కానీ శ్రీనివాసరావు కొడుకు రామ్ (కల్యాణ్ దేవ్) మాత్రం కెరీర్ ను సీరియస్ గా తీసుకోడు. ఇంజినీరింగ్ పూర్తిచేసి, ఎదురింట్లో పిల్లకు (మాళవిక నాయర్) సైట్ కొడుతూ టైమ్ పాస్ చేస్తుంటాడు. ఇలా తండ్రికొడుకుల మధ్య ఓ సంఘర్షణ నడుస్తున్న టైమ్ లో సడెన్ గా రామ్ చేసిన ఓ పని వల్ల శ్రీనివాసరావుకు గుండెపోటు వస్తుంది. గతంలో రామ్ చేసిన అల్లరి పని కారణంగా అంబులెన్స్ డ్రైవర్ కూడా సహకరించడు.
మొత్తానికి ఎలాగోలా తండ్రిని బతికించుకున్న రామ్ అప్పుడు తన బాధ్యతను తెలుసుకుంటాడు. తండ్రి అనారోగ్యం పాలవ్వడం, అతడి మనసు అర్థం చేసుకోవడంతో రామ్ పూర్తిగా మారిపోతాడు. లోకల్ బాయ్స్ పేరిట అతడు చేసిన చిన్న ప్రయత్నం సక్సెస్ అవ్వడంతో తన కెరీర్ ఏంటో తెలుసుకుంటాడు. కొడుకుగా తండ్రి కలను రామ్ ఎలా నెరవేర్చాడు..? చెల్లెలి పెళ్లి చేశాడా లేదా..? ఎదురింటి అమ్మాయి ప్రేమను దక్కించుకున్నాడా..? అనేది మిగతా కథ.
నటీనటుల పనితీరు
ఈ సినిమాకు ఇంత హైప్ రావడానికి కారణమైన కల్యాణ్ దేవ్ పెర్ఫార్మెన్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. మూవీలో కల్యాణ్ దేవ్ లుక్స్ పరంగా బాగున్నాడు. హీరో మెటీరియల్ అనిపించుకున్నాడు. తొలి సినిమానే కాబట్టి యాక్టింగ్ పరంగా ఎలాంటి కామెంట్స్ చేయలేం. కానీ మొదటి సినిమానే అయినప్పటికీ తండ్రి బాధను అర్థం చేసుకునే సన్నివేశంలో కల్యాణ్ దేవ్ చక్కగా నటించాడు. మధ్యతరగతి కుర్రాడిలా ఎదురింటి అమ్మాయిని ప్రేమలో పడేయడానికి కల్యాణ్ చేసిన పనులు అతడిలో ఈజ్ ను బయటపెట్టాయి. కొన్ని చోట్ల కామెడీ కూడా ఫర్వాలేదనిపించుకున్నాడు.
కల్యాణ్ దేవ్ తర్వాత కచ్చితంగా చెప్పుకోవాల్సి మురళీ శర్మ గురించే. మెగాస్టార్ సూచన మేరకు ఈ సినిమాలో తండ్రి పాత్రకు మురళీశర్మను తీసుకున్నారు. ఆ విషయంలో చిరంజీవి నమ్మకాన్ని వందశాతం నిలబెట్టారు మురళీశర్మ. అతడి యాక్టింగ్ సింప్లీ సూపర్బ్.
హీరోయిన్ మాళవిక నాయర్ బాగుంది. యాక్టింగ్ కూడా బాగా చేసింది. కాకపోతే తండ్రి-కొడుకుల కథ కావడంతో ఆమెకు పెద్దగా స్కోప్ దొరకలేదు. హీరో ఫ్రెండ్స్ గా నటించిన గ్యాంగ్ మొత్తం బాగా చేసింది. సత్యం రాజేష్, మహేష్ విట్టా కామెడీ అక్కడక్కడ మెరిసింది.
టెక్నీషియన్స్ పనితీరు
ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ ను తీసుకొని సగం పని పూర్తిచేశారు. హీరోగా పరిచయమౌతున్న కల్యాణ్ దేవ్ ను ఎలా చూపించాలి, ఎంత ఎట్రాక్టివ్ గా ప్రజెంట్ చేయాలనే విషయాల్ని పూర్తిగా సెంథిల్ హ్యాండిల్ చేశాడు. అతడి కెమెరావర్క్, టోటల్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం బాగుంది. చికెన్ సాంగ్ బాగా క్లిక్ అయింది. ఈ పాటకు లిరిక్స్ కూడా బాగా కుదిరాయి.
ఇక దర్శకుడిగా రాకేష్ శశి తను అనుకున్న కథను బాగానే ప్రెజంట్ చేశాడు కానీ స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. సెకెండాఫ్ లో మరో 2 బలమైన సన్నివేశాలు పడితే విజేత మరో లెవెల్లో ఉండేది. సాయి కొర్రపాటి నిర్మాణ విలువలు బాగున్నాయి.
జీ సినిమాలు రివ్యూ
ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్త హీరోలు వస్తుంటారు, పోతుంటారు. అయితే ప్రేక్షకులకు గుర్తుండిపోవాలన్నా, మరో 3 సినిమా ఆఫర్లు రావాలన్నా అర్జున్ రెడ్డి లాంటి బలమైన కథైనా దొరకాలి, లేదంటే అంతే బలమైన బ్యాకప్ అయినా ఉండాలి. కల్యాణ్ దేవ్ విషయంలో మొదటి ఆప్షన్ లేదు. రెండో ఆప్షన్ అతడికి మంచి బేస్ ఇచ్చింది.
విజేత సినిమాకు వెళ్లి థియేటర్లలో కూర్చున్న 10 నిమిషాలకు కథ ఏంటి, దాని క్లయిమాక్స్ ఏంటనేది క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోతుంది. ఇక అక్కడ్నుంచి సీట్లో కూర్చోవాలంటే కావాల్సింది కేవలం మంచి కామెడీ, కట్టిపడేసే స్క్రీన్ ప్లే మాత్రమే. ఈ విషయంలో విజేతకు వందకు వంద మార్కులు పడవు. కథ రొటీన్ అని తెలిసినప్పుడు, కథనంపై ఇంకాస్త దృష్టిపెట్టాల్సింది. స్క్రీన్ ప్లే బాగుంటే హీరో పెర్ఫార్మెన్స్ తో పెద్దగా పనుండదనే విషయం గతంలో చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. వాటి నుంచి విజేత ఏదీ నేర్చుకున్నట్టు కనిపించదు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు కథ, కథనం మొత్తం మన కనుసన్నల్లో సాగిపోతుంది. అలా అని మూవీ బోర్ కొట్టించదు. ఎక్సైట్ చేయదంతే.
దర్శకుడు రాకేష్ శశి, స్క్రీన్ ప్లేపై కాస్త గట్టిగా ఫోకస్ పెట్టాల్సింది. అందుకు తగ్గట్టుగా పేపర్ పై మరిన్ని బలమైన సన్నివేశాలు రాసుకోవాల్సింది. మరీ ముఖ్యంగా లవ్ ట్రాక్ విషయంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. కాకపోతో స్టోరీకి తగ్గట్టు నటీనటుల్ని ఎంపిక చేసుకోవడంలో, మంచి టెక్నీషియన్లను తీసుకోవడంలో రాకేష్ సక్సెస్ అయ్యాడు.
చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజేత మరీ తీసిపారేసేలా మాత్రం లేదు. సినిమాటోగ్రఫీ, సంగీతం, కాస్టింగ్ ఈ సినిమాకు బలాలు. చికెన్ పాటతో పాటు మరో 2 పాటలు బాగున్నాయి. సెంథిల్ సినిమాటోగ్రఫీ టోటల్ మూవీకే హైలెట్ గా నిలవగా.. ఆర్ట్ డైరక్టర్ రామకృష్ణ పనితనం అక్కడక్కడ మెరిసింది.
మైనస్ ఏదైనా ఉందంటే అది ఈ కథను సెలక్ట్ చేసుకోవడమే. ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చినప్పటికీ కాస్త కొత్తదనం చూపించాలని పరితపించే కాలమిది. ఇలాంటి టైమ్ లో విజేత లాంటి రొటీన్ స్టోరీ, అది కూడా మెగా అల్లుడు నుంచి రావడమనేది కాస్త డిసప్పాయింట్ కలిగిస్తుంది.
ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే మాత్రం సినిమా సేఫ్ వెంచర్ అనిపించుకుంటుంది. హీరో కల్యాణ్ దేవ్ లో స్పార్క్ ఉందని చూపించింది విజేత. మంచి స్టోరీలు సెలక్ట్ చేసుకుంటే భవిష్యత్తులో కల్యాణ్ దేవ్ విజేతగా నిలవడం గ్యారెంటీ.
బాటమ్ లైన్ – పాత కథకు కొత్త కోటింగ్
రేటింగ్ – 2.5
@ జీ సినిమాలు