క్షణం, బాహుబలి చిత్రాల ఫేమ్ అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన గూఢచారి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. శశికిరణ్ తిక్క డైరెక్ట్ చేస్తోన్న ఈ స్పై థ్రిల్లర్ ఆగష్టు 3న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవనుంది. ఉత్కంఠ రేపే కథనంతో తెరకెక్కిన ఈ సినిమాలో సుప్రియ యార్లగడ్డ, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించినట్టు మూవీ యూనిట్ తెలిపింది. నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ మళ్లీ దాదాపు 2 దశాబ్ధాల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి చేసిన సినిమా ఇది. 1995లో పవన్ కల్యాణ్ హీరోగా పరిచయం అయిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన సుప్రియ ఆ తర్వాత వెండి తెర వెనుకే ఉండిపోయారు. సినిమా స్క్రిప్ట్‌కి అనుగుణంగా అమెరికాతో పాటు హిమాచల్ ప్రదేశ్, కాకినాడ, న్యూఢిల్లీ, చిట్టగాంగ్, హైదరాబాద్, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో గుఢచారిని తెరకెక్కించామని, ఆ లొకేషన్స్ అన్నీ ఈ సినిమాకు మరో హైలైట్‌గా నిలుస్తాయని యూనిట్ సభ్యులు తెలిపారు.


అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ సస్పెన్స్ స్పై థ్రిల్లర్‌లో అడివి శేష్ సరసన మన తెలుగు అమ్మాయి, ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2013 టైటిల్ విజేత శోభిత ధూళిపాళ్ళ జంటగా నటించింది.