బాలీవుడ్ సినిమాలు కొన్నింటిలో కథానాయకుడిగా నటించిన పాకిస్తాన్ నటుడు అలీ జాఫర్, గాయకురాలు మీషా షఫీపై రూ.100 కోట్ల రూపాయలకు పరువునష్ట దావా వేశారు. ఇటీవలి కాలంలో మీషా షఫీ తన ట్విటర్ ద్వారా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అందులో ముఖ్యంగా అలీ జాఫర్ తనను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఓ పెద్ద ఉత్తరాన్ని సైతం ట్విటర్‌లో పంచుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆమె ఉత్తరానికి ట్విటర్ వేదికగా ప్రత్యుత్తరం ఇచ్చారు జాఫర్. ఆమె చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ.. నిజనిజాలు త్వరలోనే తెలుస్తాయని చెప్పారు. తన కుటుంబంతో పాటు వ్యక్తిత్వానికి కళంకం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న మీషాపై తాను తప్పకుండా చట్టపరమైన యాక్షన్ తీసుకుంటానని ఆయన తెలిపారు.



ఆ తర్వాత అలీ జాఫర్ తాను తెలిపినట్లుగానే మీషా షఫీపై రూ.100 కోట్లకు పరువునష్ట దావా వేశారు. అలాగే తనకు వెంటనే ట్విటర్ ద్వారా క్షమాపణ చెప్పాల్సిందిగా ఆయన మీషాకి తెలియజేశారు. ఈ క్రమంలో మీషా కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. మీడియా ఈ విషయాలకు సంబంధించిన నిజనిజాలు తెలుసుకోవాలంటే తన లాయర్లను కలవాల్సిందిగా తెలిపారు.



అలాగే వారి వివరాలను కూడా తెలిపారు. ఇటీవలే కాలంలో లైంగిక వేధింపులకు సంబంధించి న్యాయాన్ని కోరుతూ పలువురు నటీమణులు హాలీవుడ్‌లో మీటూ క్యాంపెయిన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ క్యాంపెయిన్ హీట్ భారతదేశంతో పాటు పాకిస్తాన్‌‌ను కూడా తాకింది. మీషా షఫీ నుండి ఆరోపణలు ఎదుర్కొన్న అలీ జాఫర్ పలు హిందీ చిత్రాలలో కూడా నటించారు. తేరే బిన్ లాడెన్, మేరే బ్రదర్ కా దుల్హన్, కిల్ దిల్, డియర్ జిందగీ లాంటి చిత్రాలు అందులో ప్రముఖమైనవి