శ్రీరెడ్డి 'అర్దనగ్న ప్రదర్శన' దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలలోనూ చర్చించుకునే అంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే శ్రీరెడ్డిపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించింది. శ్రీరెడ్డి ఎంచుకున్న విధానం తప్పని పేర్కొంది.
 
టాలీవుడ్‌లోనే కాదు.. ప్రతి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాధితులున్నారని కంగనా ఒప్పుకుంది. సినీ ఇండస్ట్రీలలో చాలామంది అమ్మాయిలు అవకాశాల కోసం ఇబ్బందులు పడుతున్నారని.. తాను కూడా
అలాంటి ఇబ్బందులు పడ్డానని కంగనా చెప్పింది. అయితే ఇలాంటి విషయాలపై నిరసన తెలియజేసేందుకు చాలా మార్గాలున్నాయని, శ్రీరెడ్డి ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది కంగనా. ఈ తరహాలో నిరసనలు వ్యక్తం చేస్తే అసలు సమస్య పక్కదారి పట్టే అవకాశం ఉందని, సరైన మార్గం ఎంచుకోవాలని సూచించింది.
 
బట్టలు విప్పేసి అర్ధనగ్న ప్రదర్శన చేయడం ద్వారా నిరసన చెప్పడం సరైన పద్ధతి కాదని, ఇటువంటి వాటి వల్ల ఇండస్ట్రీలో కొందరు సున్నిత మనస్కులు ఇబ్బందిపడతారని కంగనా తెలిపింది. ఇలా చేయడం వల్ల ఆమెకు మద్దతు ఇవ్వలనుకొనేవారు కూడా.. ఆమె పద్ధతి నచ్చక ముందుకు రారని చెప్పింది. జరిగిన అన్యాయాన్ని చెప్తూ.. పోరాడుతున్న సమస్యకు ప్రచారం
కలిగేలా చూసుకోవాలని ఆమెకు సలహా ఇస్తూ.. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై మహిళలు ధైర్యంగా గళం వినిపించాలని కోరారు.