మహానటి చిత్రంలో తాతగారి పాత్ర వేసే అర్హత తనకు లేదని, అది ఈ జన్మలో జరగని పని అన్నట్లు జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ఎవ‌డే సుబ్రహ్మణ్యం ఫేమ్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన  చిత్రం 'మహానటి'. కీర్తి సురేష్‌, దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ, సమంత తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ మే 9వ తేదిన థియేటర్ల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుక‌ను హైద‌రాబాద్‌లో నిర్వహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఆడియో రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన జూ.ఎన్టీఆర్‌ మాట్లాడుతూ 'ఈ స్టేజ్‌ మీద నిలబడి సావిత్రి  గొప్పదనం గురించి మాట్లాడే అర్హత మాకు లేదు. బహుశా ఎన్ని జన్మలెత్తినా రాదేమో. ఆవిడ ఎలా చనిపోయారనే దాని కన్నా, ఆవిడ ఎలా బతికారో కళ్లకు కట్టినట్టు చూపించే చిత్రమిది.' అన్నారు. ఇలాంటి సినిమాలు స్ఫూర్తినిచ్చేలా ఉంటాయన్నారు. అలాంటి అద్భుతమైన వ్యక్తి జీవితాన్ని నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించాడని.. ఒక అభిమానిలా ఈ సినిమా తీశారని కితాబిచ్చారు.  


దర్శకుడు కన్న కలని కలిసికట్టుగా అందరూ నెరవేర్చి ఈ చిత్రానికి ఒక అందమైన రూపం తీసుకొచ్చారన్నారు.  'ఒక గొప్ప విషయాన్ని చెప్పబోతున్నప్పుడు.. అన్నీ  కళ్లముందుకు వచ్చేస్తాయి. చాలా మంది దాన్ని దేవుడు అంటారు. కానీ నేను నేచర్‌ అంటా. ఆ నేచరే కీర్తి సురేష్‌, దుల్కర్‌, విజయ్‌, సమంతలను తీసుకొచ్చింది. పెద్ద వాళ్లు భౌతికంగా మనమధ్య లేకపోయినా ఇక్కడే ఉంటారు. అసలు సావిత్రిగారే పట్టుబట్టి తన చిత్రం తీయమని చెప్పారేమో..' అన్నారు. ఇందులో నటించిన దుల్కర్‌ సల్మాన్, విజయ్‌, కీర్తి, సమంతలకు హాట్సాఫ్‌ అని చెప్పిన తారక్.. ఈ నలుగురు వారి వారి పాత్రల్లో జీవించారన్నారు. మిక్కీ చక్కని స్వరాలు అందించారని,  స్వప్న ఇంత గొప్ప సినిమా తీస్తారని అనుకోలేదన్నారు.