`డియర్ కామ్రేడ్` హిట్టా.... ఫట్టా
గీతా గోవిందం జోడీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మరోసారి తెరపైకి వచ్చింది
భారీ అంచనాలు, సూపర్ హిట్ కాంబినేషన్, ట్రెండింగ్ గా మారిన ట్రయిలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్… ఇలా ఎన్నో పాజిటివ్ వైబ్స్ మధ్య వచ్చింది ‘డియర్ కామ్రేడ్’. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. మరి విజయ్ ఆశించిన విజయం ఈ సినిమాతో దక్కిందా? థియేటర్లలో కామ్రేడ్ పాసయ్యాడా? అనేది తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లవెళ్లాల్సిందే...
కథ :
కాకినాడలో ఓ కాలేజ్‌లో చదువుకునే చైతన్య అలియాస్ బాబీ (విజయ్ దేవరకొండ) విప్లవ భావాలున్న కాలేజీ స్టూడెంట్. బాబీ తన కోపం కారణంగా కొంతమందితో గొడవలు పడతాడు. తన కజిన్ పెళ్లి కోసం కాకినాడ వచ్చిన అపర్ణా దేవీ అలియాస్ లిల్లీ (రష్మిక మందన్న) ప్రేమలో పడతాడు. బాబీ కోపం, గొడవల కారణంగా అతనికి దూరమవుతుంది లిల్లి. అలా దూరమైన లిల్లీని తలుచుకుంటూ బాబీ పిచ్చివాడైపోతాడు. మూడేళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఒంటరిగా ట్రావెల్ చేస్తూ లిల్లీ ని మర్చిపోయే ప్రయత్నం చేస్తాడు.
నెమ్మదిగా తన బాధను మరిచిపోయిన బాబీ అనుకోకుండా ఓ ప్రాజెక్ట్ పని మీద హైదరాబాద్ వస్తాడు. అక్కడ మళ్ళీ లిల్లీని కలుస్తాడు. తను మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుందని తెలుసుకొని ఆమెను తన మ్యూజిక్ థెరపీతో కోలుకునేలా చేస్తాడు. అదే సమయంలో లిల్లీ ఆరోగ్యం పాడవ్వడానికి, క్రికెట్ కి దూరమవ్వటానికి క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ కారమని తెలుసుకుంటాడు. అప్పుడు బాబీ, లిల్లీ కోసం ఓ కామ్రేడ్ లా నిలబడి ఆ చైర్మన్ కు ఎలాంటి శిక్ష వేయించాడనేది సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు :
చేసింది తక్కువ సినిమాలే అయినా తన క్యారెక్టర్ లో మరో హీరోని ఊహించుకోలేనంతగా మెస్మరైజ్ చేయడం విజయ్ నైజం. ఈ సినిమాలో కూడా బాబీ క్యారెక్టర్ లో విజయ్ అదరగొట్టేశాడు. సినిమాలో బాబీ పాత్రలో మరో హీరోని ఊహించుకోలేం. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో యాంగ్రీ పెర్ఫార్మెన్స్ తో సినిమాకు మెయిన్ హైలైట్ అనిపించుకున్నాడు. రష్మిక తన పెర్ఫార్మెన్స్ తో ఎప్పటిలాగే క్యారెక్టర్ కి బెస్ట్ అనిపించుకుంది. లిల్లీ క్యారెక్టర్ లో ఉన్న పెయిన్ ని స్క్రీన్ పై చూపించడంలో రష్మిక సక్సెస్ అయింది. జయ క్యారెక్టర్ లో శృతి రామచంద్రన్ నటన బాగుంది.
నెగిటీవ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ లో రాజ్ ఆర్జున్ పరవాలేదు అనిపించుకున్నాడు. సంజయ్ స్వరూప్, తులసి, శివ శ్రీ కంచి, తదితరులు క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. కొన్ని సందర్భాల్లో తన కామెడీ టైమింగ్ తో సుహాస్ ఎంటర్టైన్ చేసాడు. మిగతా నటీనటులంతా కొత్త వారైనప్పటికీ పరవాలేదనిపించుకున్నారు.
సాంకేతిక వర్గం పనితీరు:
సినిమాకు తన మ్యూజిక్ తో మెయిన్ పిల్లర్ గా నిలిచాడు జస్టిన్ ఫ్రభాకరన్. పాటలతో పాటు సినిమాకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ‘నీ నీలి కన్నుల్లోన’, ‘తిరి తిరి ‘ పాటలు పిక్చరైజేషన్ పరంగానూ ఆకట్టుకున్నాయి. సుజీత్ సారంగ్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. కథకు తగ్గట్టుగా తన విజువల్స్ తో ఎట్రాక్ట్ చేసాడు. ఎడిటింగ్ పరవాలేదు. కాకపోతే లెంగ్త్ ఎక్కువైంది. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేస్తే బాగుండేది. ఆర్ట్ వర్క్ బాగుంది.
సందర్భానుసారంగా వచ్చే జె కృష్ణ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. చైతన్య ప్రసాద్, రహమాన్, కృష్ణకాంత్ సాహిత్యం బాగుంది. మురళి కొరియోగ్రఫీ చేసిన ఫైట్స్ రియలిస్టిక్ గా ఉన్నాయి. భరత్ కమ్మ డెబ్యూ అయినప్పటికీ సినిమాను బాగానే హ్యాండిల్ చేసాడు. కొన్ని సన్నివేశాలను అనుభవం ఉన్న దర్శకుడిగా డీల్ చేసాడు. మైత్రి మూవీ మేకర్స్ , బిగ్ బెన్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
సమీక్ష :
ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పిన ‘డియర్ కామ్రేడ్’ పరవాలేదు అనిపించుకున్నాడు. బలమైన కంటెంట్ ఉన్నప్పటికీ సినిమా కాస్త నెమ్మదిగా నడవడం, లెంగ్త్ ఎక్కువకావడంతో పూర్తి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ముఖ్యంగా హీరో తాలూకు బ్యాక్ గ్రౌండ్ ని కాకినాడ కాకుండా విజయవాడ, హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో చూపిస్తే ఇంకా ఇంపాక్ట్ ఉండేది. స్టూడెంట్స్ ని వాడుకొని రాజకీయం నడిపే సంఘటనలు ఎక్కువగా ఈ రెండు ప్రదేశాల్లోనే చూస్తాం. కాకపోతే లోకేషన్స్ కోసం దర్శకుడు కాకినాడని ఎంచుకున్నట్టు అనిపిస్తుంది.
హీరోయిన్ కి ఒక సమస్య, ఆ సమస్యపై హీరో చేసిన పోరాటం… ఒక్కముక్కలో కథ చెప్పాలంటే కథ ఇంతే… కాకపోతే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సమస్యను సినిమా కోసం తీసుకున్నాడు భరత్. సినిమా ప్రారంభమైన ఓ 10 నిమిషాలు ప్రేక్షకుడిలో ఆసక్తి నెలకొల్పిన దర్శకుడు ఆ తర్వాత లవ్ స్టోరీతో అలరించాడు. అయితే మొదటి భాగంలో కథలోకి వెళ్ళకుండా ఎక్కువ సమయం కాలక్షేపం చేసాడు. అలా కాకుండా స్క్రీన్ ప్లే లో స్పీడ్ పెంచి సినిమా స్పీడప్ చేసి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేది. కొన్ని సందర్భాల్లో అర్జున్ రెడ్డి ఛాయలు కూడా కనిపిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో బలం లేకపోయినా సంగీత దర్శకుడు తన నేపథ్య సంగీతంతో బలం చేకూర్చాడు.
‘గీతగోవిందం’లో విజయ్ -రష్మిక కెమిస్ట్రీ కి మంచి మార్కులే పడ్డాయి. ఆ మేజిక్ ఇందులో కూడా రిపీట్ అయింది. వీళ్ళిద్దరి మద్య వచ్చే రొమాంటిక్ సీన్స్ మొదటి భాగంలో బాగా పండాయి. అవి మినహాయిస్తే మాత్రం మొదటి భాగంలో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఇక రెండో భాగంలో చెప్పడానికి స్ట్రాంగ్ పాయింట్ ఉన్నప్పటికీ దాన్ని మరీ సాగదీస్తూ స్లోగా చూపించడం, మేలో డ్రామా సినిమాకు మైనస్. ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ ఎపిసోడ్స్ మాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ఫైనల్ గా డియర్ కామ్రేడ్ కొంత వరకూ మెప్పిస్తాడు.
నటీనటులు : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా, శృతి రామ చంద్రన్, సంజయ్ స్వరూప్, తులసి, సుహాస్ తదితరులు
సంగీతం: జస్టిన్ ఫ్రభాకరన్
ఛాయాగ్రహణం : సుజీత్ సారంగ్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యష్ రంగినేని
కథ- స్క్రీన్ ప్లే -దర్శకత్వం : భరత్ కమ్మ
సెన్సార్ : U /A
నిడివి : 169 నిమిషాలు
విడుదల తేది : 26 జులై 2019
రేటింగ్ : 2.75/5
@ జీ సినిమాలు