సన్యాసిని ఆశీస్సులు పొందాడని.. పోలీసాఫీసర్ పై చర్యలు
న్యూఢిల్లీలోని జనకపూరి ప్రాంతానికి చెందిన పోలీసాఫీసర్ ఇంద్రపాల్ సింగ్ చాలా చిత్రమైన చిక్కు్ల్లో పడిపోయారు.
న్యూఢిల్లీలోని జనకపూరి ప్రాంతానికి చెందిన పోలీసాఫీసర్ ఇంద్రపాల్ సింగ్ చాలా చిత్రమైన చిక్కుల్లో పడిపోయారు. పోలీస్ యూనిఫారంలో ఓ సన్యాసిని వద్దకు వెళ్లి ఆమె దీవెనలు పొందాడని చెబుతూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆ ఆఫీసరుని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. జనకపూరి ఎస్‌హెచ్‌ఓలో పోలీస్ అధికారిగా సేవలందిస్తోన్న ఇంద్రపాల్ సింగ్... సన్యాసిని నమితా ఆచార్యకి మహాభక్తుడు. తొలుత ఆ సన్యాసిని... ఇంద్రపాల్ సింగ్ తలకు మసాజ్ చేస్తుందని తెలుపుతూ కొందరు పలు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఆ ఫోటోలపై వివరణ ఇస్తూ.. తాను మసాజ్ చేయించుకోవడం లేదని.. ఆమె తనను దీవించారని సింగ్ తెలిపారు. అయితే సన్యాసులను, బాబాలను దర్శించుకోవడానికి అలాంటి చోట్లకు ఒక అధికారి హోదాలో యూనిఫారంతో వెళ్లడం తప్పు అని చెబుతూ తొలుత ఆ అధికారిని శాఖ సస్పెండ్ చేయాలని భావించినా.. ఆ తర్వాత బదిలీతోనే సరిపెట్టుకుంది. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలోని విజిలెన్స్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
గతంలో కూడా షాదారా జిల్లాలో ఇలాంటి సంఘటనే జరిగింది. వివాదాస్పద మాతాజీ రాధేమా ఆశీస్సులు పొందడానికి యూనిఫారంలో వెళ్లిన సంజయ్ శర్మ అనే పోలీసాఫీసరుని కూడా అధికారులు బదిలీ చేశారు. క్రమశిక్షణ చర్యలలో భాగంగా ఆ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తాజా ఘటనలో కూడా నమితా ఆచార్య వద్దకు వెళ్లి ఆశీస్సులు పొందిన ఇంద్రపాల్ సింగ్‌కు కూడా ఇదే శిక్షను పోలీస్ డిపార్టుమెంటు విధించింది. పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్న వారు హుందాగా ప్రవర్తించాలని.. ఇలాంటి పనులు చేయడం వల్ల శాఖకే చెడ్డ పేరు వస్తుందని... అందుకే అలాంటి ఆఫీసర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం తప్పదని ఈ సందర్భంగా అసిస్టెంట్ కమీషనర్ తెలిపారు.