దాదాపు పదేళ్ల తరువాత బాలీవుడ్‌లో అక్కినేని నాగార్జున 'బ్రహ్మాస్త్రా' చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా నటిస్తుండగా.. నాగ్‌ ఓ కీలక పాత్రలో కన్పించనున్నారు. ‘బ్రహ్మాస్త్రా’ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో అమితాబ్ నటించిన ‘ఖుదా గవా’ చిత్రంతో పాటు ‘జఖమ్‌’, ‘అగ్ని వర్ష’, ‘ఎల్‌వోసీ కార్గిల్‌’ చిత్రాల్లో కన్పించిన నాగార్జున.. చాలా గ్యాప్ తీసుకొని మళ్లీ బిగ్‌బీతో కలిసి నటిస్తున్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


'బ్రహ్మాస్త్రా' చిత్రానికి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నాగ్‌ది ప్రత్యేకమైన పాత్ర అని, ఆయనతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నామని ఈ చిత్ర నిర్మాత కరణ్‌ జోహార్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.


అయితే ఈ చిత్రంలో నాగార్జున.. నటి డింపుల్‌ కపాడియాకు జోడీగా నటించనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. బల్గేరియాలో తొలి షెడ్యూల్‌‌ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. రెండో షెడ్యూల్‌‌కు రెడీ అయ్యింది. ఈ షెడ్యూల్‌లో నాగార్జునపై సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.



ఒకవేళ నాగ్‌కు జోడీగా డింపుల్‌ నటిస్తున్న మాట వాస్తవమే అయితే దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆమె నటించే సినిమా ఇదే అవుతుంది. భారీ బడ్జెట్‌తో 'బ్రహ్మాస్త్రా' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.