ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్న తేజ
స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ .
స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ . ప్రముఖ దర్శకుడు తేజ ఆధ్వర్యంలో ఇటీవలే ఈ సినిమా షూటింగ్ రామకృష్ణ స్టూడియోస్ ప్రాంగణంలో రంగరంగవైభవంగా ప్రారంభమైంది. బాలకృష్ణ స్వయానా ఈ సినిమాకి ఒకానొక నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మ తేజ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ క్రమంలో ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న తేజ అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సినిమా దర్శకుడిగా బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ‘నేను ఎన్టీఆర్‌కు గొప్ప అభిమానిని. ఈ చిత్రానికి సంబంధించి న్యాయం చేయలేనని నాకు అనిపించింది. అందుకే దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకుంటున్నాను’ అని ఆయన తెలియజేశారు. ఇటీవలే ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరై ముహుర్తం షాట్‌కి క్లాప్ ఇచ్చారు.
రామ్ గోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా "లక్ష్మీస్ ఎన్టీఆర్" తీస్తానని తెలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలువురు ఈ బయోపిక్ మీద ఆసక్తి చూపించారు. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్‌లో తన తండ్రి పాత్రలో తానే నటిస్తానని ఆఖరికి స్పష్టం చేశారు. తేజను ఆ చిత్రానికి దర్శకుడిగా తీసుకున్నామని కూడా తెలిపారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి ఇతర నటీనటుల ఎంపికకు కూడా బాగానే కసరత్తు జరిగింది.
ముఖ్యంగా ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రకు గాను బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ను సంప్రదించినట్లు సమాచారం. అలాగే జయలలిత పాత్రకు గాను కాజల్ అగర్వాల్‌ని సంప్రదించారు. ఇంకా అనేకమంది నటీనటుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ క్రమంలో దర్శకుడు తేజ ఈ చిత్రం నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు