సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ, సమంత హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "రంగస్థలం". ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో వస్తున్న చిత్రాలు తగ్గుముఖం పట్టడంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ చిత్రానికి ప్రేరణ గతంలో మెగాస్టార్ నటించిన పలు చిత్రాలు అనే టాక్ వినిపిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెగాస్టార్ నటించిన తొలి చిత్రం "ప్రాణం ఖరీదు"తో పాటు ఆయన గతంలో నటించిన శివుడు శివుడు శివుడు, మన వూరి పాండవులు, ఊరికిచ్చిన మాట లాంటి సినిమాలు ఈ చిత్రానికి ప్రేరణ కావచ్చు అని పలువురు అంటున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ప్లాట్‌ని చిరంజీవే ఆడియో రిలీజ్  వేడుకలో బహిర్గతం చేశారు. ఈ చిత్రంలో హీరో చిట్టిబాబు అనే ఓ పల్లెటూరి యువకుడని.. తన అన్నను చంపిన వారిపై ఎలా పగ తీర్చుకుంటాడన్నదే కథాంశమని తెలిపారు. దీంతో ఈ సినిమా రివెంజి డ్రామా అన్న విషయం తేటతెల్లమైంది. 



 


అయితే పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన రివెంజి డ్రామాలు తెలుగు సినిమాకి కొత్త కాదు. గతంలో ఊరుమ్మడి బతుకులు, ఎర్రమందారం, పదహారేళ్ళ వయసు లాంటి సినిమాలు ఇలాంటి కాన్సెప్ట్స్‌తో తెరకెక్కినవే. అయితే నేటి తరానికి ఈ కాన్సెప్ట్ చాలా కొత్త. రామ్ చరణ్ కూడా ఈ సమయంలో చాలా వైవిధ్యమైన కాన్సెప్ట్ ఎంచుకోవడం గమనార్హం.


ఇక తమిళ సినిమాల విషయానికి వస్తే.. ఇలాంటి కాన్సెప్ట్స్ వారికి కొట్టిన పిండి. ఆడుకాలమ్, మైనా లాంటి సినిమాలు పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిన చిత్రాలే. నేచురాలిటీ మిస్ అవ్వకుండా సినిమా తీయడం ఇలాంటి కాన్సెప్ట్స్‌లో ప్రత్యేకత. ఏది ఏమైనా..రంగస్థలం సినిమాతో టాలీవుడ్ కూడా మూసధోరణి నుండి బయట పడి మంచి కథనాల వైపు అడుగులు వేస్తుందనేది విమర్శకుల అభిప్రాయం.