ఫేస్‌బుక్ త్వరలో ఓ సరికొత్త పథకంతో ముందుకొస్తుందని.. అందులో భాగంగా యూజర్స్ డబ్బు సంపాదించుకొనే అవకాశం ఉందని పలు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఫేస్‌బుక్ యాజమాన్యం ఎఫ్‌బీ గ్రూపులను మానిటైజ్ చేయాలని భావిస్తుందట. ఇలా మానిటైజ్ చేయడం వల్ల ఎవరైనా మీరు ప్రారంభించిన గ్రూపులో చేరాలంటే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ చెల్లించిన మొత్తంలో కమీషను పోను మిగతా మొత్తం అంతా ఫేస్‌బుక్ యూజర్ ఖాతాలో జమ చేస్తుందట. అయితే గ్రూపుకున్న పాపులారిటీ, మెంబర్లు, కంటెంట్ లాంటివన్నీ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయట. ప్రస్తుతం పేరెంటింగ్, కుకింగ్ గ్రూపులను మానిటైజ్ చేయాలనే యోచనతో ఫేస్‌బుక్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే.. ప్రస్తుతం ఈ అంశాలలో బాగా పాపులర్ అయిన గ్రూపుల పంట పండినట్లే. 


అమెరికాలో ఎఫ్‌బీ గ్రూపులను మానిటైజ్ చేసి.. ఆ గ్రూపు పాపులారిటీని బట్టి.. గ్రూపులో చేరే ఔత్సాహికుల నుండి 4 డాలర్ల నుండి 29 డాలర్ల వరకు వసూలు చేసేందుకు ఫేస్‌బుక్ ప్రయత్నిస్తోంది.


అలాగే గ్రూపులను మానిటైజ్ చేయించుకున్నాక.. గ్రూపును నిర్వహిస్తున్న యూజర్ కూడా తనకు తానే యూజర్ ఛార్జీ నిర్ణయించే సౌలభ్యం కూడా ఉంది. అయితే ఇంకా ఈ గ్రూపు మానిటైజేషన్ విషయం గురించి ఫేస్ బుక్ ఇండియా నుండి ఎలాంటి అధికారిక సమాచారమూ వెలువడలేదు.