టిఫిన్లు కట్టడానికి పవిత్ర గ్రంథం పేజీలు వాడారు.. జైలుకెళ్లారు..!
ఓ పూజారి భార్య చేసిన అనాలోచితమైన పని ఆమెతో పాటు తన భర్తను కూడా జైల్లో పెట్టేలా చేసింది.
ఓ పూజారి భార్య చేసిన అనాలోచితమైన పని ఆమెతో పాటు తన భర్తను కూడా జైల్లో పెట్టేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్ ప్రాంతానికి చెందిన గురుద్వారాలో పనిచేస్తున్న పూజారి భార్య తన పిల్లలను స్కూలుకు పంపించడానికి ముందు వారు తినేందుకు చపాతీలు చేశారు. అయితే వాటిని చుట్టడానికి ఏ ఇతర పేపర్లు దొరక్కపోవడంతో సిక్కుల పవిత్రగ్రంథమైన గురు గ్రంథ్ సాహెబ్‌లోని కొన్ని పేజీలను చింపి.. వాటిని చపాతీలను చుట్టడానికి వినియోగించారు. అయితే పిల్లలు స్కూల్లో చపాతీలు తింటున్నప్పుడు ఆ పేజీలు పలువురు టీచర్ల కంటపడ్డాయి.
తర్వాత ఆ వార్త వారి నుండి సిక్కు స్టూడెంట్ ఫెడరేషన్ వారికి చేరింది. అయితే జరిగిన సంఘటనకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించిన ఫెడరేషన్ వారు.. పిల్లల ఇంటికి వెళ్లి విషయాన్ని కనుగొన్నారు. వంటగదిలో చాలా అధ్వానమైన స్థితిలో ఉన్న సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహెబ్‌ను చూశారు. తర్వాత.. ఆ గ్రంథంలో పలు పేజీలు చించేసినట్లు కూడా వారి దృష్టికి వచ్చింది.
అయితే కారణం అడిగినప్పుడు... కుటుంబ సభ్యుల నుండి వచ్చిన సమాధానం పొంతన లేనిదని తమకు అనిపించడంతో ఫెడరేషన్ సభ్యులు, జరిగిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత పోలీసులు పూజారితో పాటు తన భార్యను కూడా అరెస్టు చేశారు. వారిపై వివిధ సెక్షన్ల క్రింద కేసులు కూడా నమోదు చేశారు. గురుద్వారాకి పూజారి స్థాయిలో పనిచేస్తున్న ఉన్న వ్యక్తి.. కనీసం తమ మతగ్రంథంపై గౌరవాభిమానాలు కూడా లేకుండా ప్రవర్తించడం దురదృష్టకరమని.. అందుకే ఆయనపై కేసులు నమోదు చేశామని ఈ సందర్భంగా ఫెడరేషన్ సభ్యులు తెలిపారు.