`సంజూ` నిర్మాతలకు అబూ సలేం లీగల్ నోటీసులు
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన `సంజూ` చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన "సంజూ" చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రంపై గ్యాంగ్‌స్టర్ అబూ సలేం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ చిత్రంలో తన పాత్రను వక్రీకరించి చూపారని ఆయన పేర్కొన్నారు. తాను ఎప్పుడూ సంజయ్ దత్‌ను కలవలేదని.. అలాగే ఆయనకు ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయలేదని.. అలాంటప్పుడు తన పేరు నిర్మాతలు ఎలా వాడుకుంటారని అబూ సలేం ఆరోపించారు. ఈ క్రమంలో "సంజూ" చిత్ర నిర్మాతలు రాజ్‌కుమార్ హిరాణీ, విధు వినోద్ చోప్రాలకు న్యాయవాది ప్రశాంత్ పాండే ద్వారా అబూ సలేం లీగల్ నోటీసులు పంపించారు.
1993లో ముంబయి పేలుళ్ల కేసులో అబూ సలేంకు జీవిత ఖైదు పడిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో సంజయ్ దత్ అక్రమ ఆయుధాలను కలిగి ఉన్న కారణంగా జైలుకెళ్లారు. తన న్యాయవాది ద్వారా పంపించిన నోటీసుల్లో అబూ సలేం పలు విషయాలను స్పష్టం చేశారు. తన పరువుకు భంగం కలిగించినందుకు నిర్మాతలు నష్ట పరిహారం కూడా చెల్లించాలని.. అలాగే సినిమాలో అబు సలేం పేరును ఉపయోగించిన సీన్‌ను తొలిగించాలని కూడా ఆయన పేర్కొన్నారు.
అబూ సలేంను గతంలో బాలీవుడ్ సంగీత దిగ్గజం గుల్షన్ కుమార్ హత్యకేసులో కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆయనపై విదేశాలలో కూడా అనేక కేసులు నమోదయ్యాయి. అబూ సలేం ప్రేయసి మోనికా బేడిని 2002లో పోర్చుగల్‌లో ఇంటర్ పోల్ అరెస్టు చేసింది. 2006లో టాడా కోర్టు అబూ సలేంతో పాటు ఆయన అనుచరుడు రియాజ్ సిద్దిఖీపై బాంబు కేసుల్లో ఎనిమిది అభియోగాలు నమోదు చేసింది. అబు సలేం ప్రస్తుతం ముంబయిలో అత్యంత ప్రతిష్ట భద్రత గల ఆర్థూర్ జైలులో ఉన్నాడు.