సంజయ్‌ జీవితాధారంగా రాజ్‌కుమార్‌ హిరాణీ తెరకెక్కించిన సినిమా ‘సంజు’. రణ్‌వీర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలైన తొలిరోజు నుంచే బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించింది. దేశవ్యాప్తంగా తొలివారంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘సంజు’ తొలి ఐదు స్థానాల్లో నిలిచింది. సంజయ్‌ దత్‌పై పడిన ముద్రను చెరిపేసి అతన్ని మంచివాడిగా చూపించడానికే ఈ మూవీని తీశారని పలువురు నెటిజన్లు ఆరోపించగా.. సినిమాలో చూపించినదంతా నిజమేనని చాలాసార్లు చెప్పానని సంజయ్ బదులిచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోసారి జీవితంలో అటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోకూడదని కోరుకుంటున్నట్లు సంజయ్ దత్ అన్నారు. వియాన్ ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూలో తన జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల గురించి మాట్లాడిన సంజయ్.. బయోపిక్ ఆలోచన తన భార్య మాన్యతదే అని, జైల్లో ఉన్నప్పుడే ఆవిడ డైరెక్టర్‌తో సంప్రదించిందని చెప్పారు. 


 ఓ తుపాకీ నా జీవితాన్ని ఇలా నాశనం చేస్తుందని ఊహించలేదని.. దాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి చాలా డబ్బులు చెల్లించానని సంజయ్ అన్నారు. 'నేను ఉగ్రవాదిని కాను. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో మాత్రమే జైల్లో పెట్టారు. నేను ఒక మామూలు మనిషిలా తిరిగొచ్చాను. అరెస్టును ధైర్యంగా ఎదుర్కొన్నాను'  అని అన్నారు.  సినిమాలో ఉన్న ఆడవాళ్ల పాత్రలను పెట్టమని నేనడగలేదని, అది డైరెక్టర్ నిర్ణయమేనని అన్నారు. జీవితంలో తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువగా ఉందని.. అందుకే సినిమాలో వారిద్దరి గురించి ఎక్కువసేపు చూపించారన్నారు.


'మా నాన్న చాలా స్ట్రిక్ట్‌. నాకు అమెరికాలో సెటిలై.. మాంసం అమ్ముకుంటూ ఉండాలని అనిపించేది. కానీ మా నాన్న అమెరికాకు వచ్చి నన్ను వెనక్కు తీసుకువచ్చేశారు.’ అని చెప్పారు సంజయ్‌. రాజకీయాల్లో రావాలని కోరుకోవడం లేదని.. సోదరి ప్రియా తన తండ్రి వారసత్వం కొనసాగిస్తుందని తెలిపారు. తన చెల్లెళ్లకు, భార్య మాన్యతకు మధ్య మనస్పర్థలు లేవని స్పష్టం చేశారు.


35 ఏళ్ల కెరీర్‌లో సంజయ్ దత్ ఎన్నో సినిమాల్లో నటించారు. ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. ఆయన్ను మలుపుతిప్పిన సినిమా మున్నాభాయ్ ఎంబీబీఎస్. ప్రస్తుతం ఆయన 'సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్3' లో నటిస్తున్నారు.