నాని క్రికెటర్‌గా నటించిన జెర్సీ మూవీ రివ్యూ
జెర్సీ మూవీ రివ్యూ
నటీనటులు: నాని, శ్రద్ధ శ్రీనాధ్, సత్యరాజ్, రోనిత్ కమ్ర, రావు రమేష్, ప్రవీణ్
సంగీతం: అనిరుథ్
కెమెరా: సాను జాన్
ఆర్ట్: అవినాష్ కొల్ల
ఎడిటర్: నవీన్ నూలి
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిడివి: 2 గంటల 30 నిమిషాలు
సెన్సార్ : క్లీన్ U
రిలీజ్ డేట్: ఏప్రిల్ 19, 2019
నాని ఎప్పుడూ రిలీజ్‌కు ముందు ఇలా మాట్లాడలేదు. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్పలేదు. జెర్సీ సినిమాపై నానికి ఎందుకు అంత నమ్మకం? ఈరోజే థియేటర్లలోకొచ్చిన జెర్సీ సినిమా నాని నమ్మకాన్ని నిలబెట్టిందా లేదా అనేది ఈ రివ్యూలోకి వెళ్లిచూద్దాం.
కథ
అర్జున్ (నాని).. క్రికెట్ అతడి ప్రపంచం. హైదరాబాద్ ప్లేయర్‌గా ది బెస్ట్ అనిపించుకుంటాడు. రంజీల్లో కూడా సత్తా చాటుతాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో క్రికెట్‌ను వదిలేస్తాడు. ప్రేమించిన సారా (శ్రద్ధ శ్రీనాధ్)ను పెళ్లి చేసుకుంటాడు. వాళ్లకు ఓ కొడుకు కూడా పుడతాడు. కానీ క్రికెట్‌ను వదిలేసి పదేళ్లయినా జీవితంలో సెటిల్ అవ్వడు అర్జున్. భార్య సంపాదన మీద బతుకుతుంటాడు. ప్రభుత్వ ఉద్యోగం కూడా పోగొట్టుకుంటాడు.
అనుకోని సంఘటనల మధ్య మరోసారి క్రీజ్‌లోకి అడుగుపెట్టిన అర్జున్... ఊహించని విధంగా క్రికెట్ బ్యాట్ పట్టుకుంటాడు. 36 ఏళ్ల లేటు వయసులో అర్జున్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటాడు? అసలు అర్థాంతరంగా అర్జున్ క్రికెట్‌ను వదిలేయడానికి కారణం ఏంటి? క్లయిమాక్స్‌లో అర్జున్ ఏం సాధించాడు? అనేది బ్యాలెన్స్ కథ.
నటీనటుల పనితీరు:
నాని… నాని.. నాని.. జెర్సీ గురించి మాట్లాడితే నాని గురించి తప్ప ఇక ఎవ్వరి గురించి మాట్లాడనక్కర్లేదు. నేచురల్ స్టార్‌కు సాలిడ్ క్యారెక్టర్ పడితే ఎలా ఉంటుందో జెర్సీ చూస్తే తెలుస్తుంది. సినిమాలో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు నాని. కొన్ని సందర్భాల్లో నాని ఇచ్చిన చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా ఎంతో చెబుతాయి. సినిమాకు అదే ప్లస్ అయింది.
హీరోయిన్ శ్రద్ధా శ్రీనాధ్‌కు ఇది పర్ఫెక్ట్ డెబ్యూ. దాదాపు 3 ఆఫర్లు వదులుకొని మరీ ఆమె ఎందుకు 'జెర్సీ'నే ఎంచుకుందో సినిమా చూస్తే తెలుస్తోంది. లవర్‌గా, భార్యగా, ఓ బిడ్డకు తల్లిగా శ్రద్ధ అద్భుతంగా నటించింది. హీరో, హీరోయిన్ల తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర సత్యరాజ్. కోచ్ పాత్రలో సత్యరాజ్ బాగా నటించాడు. ఇంకా చెప్పాలంటే తెలుగులో బాహుబలి తర్వాత సత్యరాజ్ చేసిన బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఇదే. నాని ఫ్రెండ్‌గా ప్రవీణ్, లాయర్‌గా రావు రమేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నీషియన్స్ పనితీరు:
ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ బెస్ట్ ఔట్పుట్ ఇచ్చారు. ఎవర్నీ తక్కువ చేయడానికి వీల్లేదు. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది సాను గురించే. ఇతడి సినిమాటోగ్రఫీ అద్భుతం. దీనికి అనిరుధ్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాడ్ అయింది. తెరవెనక ఈ రెండు ఎలిమెంట్స్ జెర్సీ సినిమాకు ఒక బ్యాక్ బోన్‌గా నిలిచాయి. అవినాష్ ఆర్ట్ వర్క్ బాగుంది. నవీన్ నూలి ఇంకొన్ని సీన్స్ ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. ఫస్టాఫ్‌లో కాస్త స్లో అనిపిస్తుంది. వీళ్లందర్నీ నడిపించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కేవలం కథను నమ్మి ఎలాంటి డీవియేషన్స్ లేకుండా సినిమా తీశాడు. కావాలనుకుంటే ఇందులో చిన్న కామెడీ ట్రాక్ పెట్టొచ్చు. లవ్ ట్రాక్‌ను ఇంకాస్త పెంచొచ్చు. చివరికి క్రికెట్ సన్నివేశాల్ని కూడా కావాలంటే ఇంకాస్త పెంచుకోవచ్చు. కానీ కథకు ఎంత అవసరమో అంతే చూపించాడు. ఏది అవసరమో అదే ఉంచాడు. చేసింది రెండో సినిమానే అయినప్పటికీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరక్షన్ చూస్తే ఇది గౌతమ్ రెండో సినిమా అనిపించదు. అంత డీటెయిలింగ్ వర్క్ చేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇలాంటి స్టోరీని ఎంచుకోవడంలోనే వాళ్ల టేస్ట్ ఏంటో తెలుస్తుంది.
క్రికెట్ అనేదే అతిపెద్ద ఎమోషన్. ఆ ఎమోషన్‌కు తండ్రి-కొడుకు అనే మరో పెద్ద ఎమోషన్‌ను.. భార్య అనే ఇంకో పెద్ద ఎమోషన్‌ను కూడా యాడ్ చేశారు. దీనికితోడు సినిమాలో నాని యాక్టింగ్. ఇవన్నీ కలిసి జెర్సీ సినిమాను హార్ట్ టచింగ్‌గా మార్చేశాయి. నిజంగా ఈ సినిమా గుండెలు పిండేస్తుంది. నాని స్పోర్ట్స్ బేస్డ్ సినిమా చేస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఇది కేవలం స్టోర్ట్స్ బేస్డ్ సినిమా కాదని ప్రమోషన్స్‌లో పదేపదే చెబుతూ వచ్చాడు నాని. అది నిజమే. ఇది ఓన్లీ స్పోర్ట్స్ డ్రామా కాదు. లార్జర్ దేన్ లైఫ్ సినిమా. అర్జున్ అనే ఓ క్రికెటర్ జీవితం ఇది. ఫ్యామిలీ లైఫ్‌లో ఇమడలేక, క్రికెట్‌ను వదులుకోలేక మధనపడే ఓ క్రికెటర్ స్ట్రగుల్ ఇది.
ఇది కచ్చితంగా నాని సినిమా. నాని మాత్రమే చేయగల సినిమా. ప్రతి ఎమోషన్‌ను అద్భుతంగా పండించాడు నాని. లవర్‌గా, క్రికెటర్‌గా, తండ్రిగా.. ఇలా ప్రతి షేడ్‌లో నాని ది బెస్ట్ అనిపించుకున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేచురల్ స్టార్ అనే బిరుదుకు మరోసారి న్యాయం చేశాడు. ఇక హీరోయిన్ శ్రద్ధా శ్రీనాధ్‌ను ఈ సినిమా కోసం ఎందుకు తీసుకున్నారో, ఆమె ఎందుకు ఈ సినిమా ఒప్పుకుందో సినిమా చూసిన ప్రేక్షకులకు అర్థమైపోతుంది.
డైరక్టర్-హీరో మధ్య కో-ఆర్డినేషన్‌కు జెర్సీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. డైరక్టర్ గౌతమ్ రైటింగ్ చాలా బాగుంది. ఎక్కడైతే ప్రేక్షకుడు బోర్ ఫీలవుతాడో, రొటీన్ అని ఇబ్బంది పడతాడో అలాంటి స్టఫ్‌ను చాలా చాకచక్యంగా పక్కకు తప్పించాడు. ఏదైతే హృదయానికి హత్తుకుంటుందో అలాంటి సన్నివేశాల్నే పెట్టాడు. క్లైమాక్స్‌లో దర్శకుడి వర్క్ స్పష్టంగా కనిపిస్తుంది. ఒకే ఒక్క సింగిల్ డైలాగ్‌తో సినిమాను ముగించిన విధానం చాలా బాగుంది.
అర్జున్ అనే క్రికెటర్ ఎందుకు క్రికెట్ వదులుకోవాల్సి వచ్చింది? క్రికెట్ వదులుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎందుకు పోగొట్టుకోవాల్సి వచ్చింది? అతడు తిరిగి క్రికెటర్‌గా మారడానికి కారణం ఏంటి? 36 ఏళ్ల లేటు వయసులో క్రికెటర్‌గా అర్జున్ ఏం సాధించాడు? లాంటి ఎలిమెంట్స్‌ను ఇందులో హార్ట్ టచింగ్‌గా చూపించారు.
మరీ ముఖ్యంగా క్రికెట్ ఎపిసోడ్స్‌ను రియలిస్టిక్‌గా చూపించడంలో యూనిట్ అంతా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది. ఈ విషయంలో ఏ ఒక్కరికో క్రెడిట్ ఇవ్వలేం. దర్శకుడు, హీరో, కెమెరామెన్, సంగీత దర్శకుడు, ఆర్ట్ డైరక్టర్… ఇలా ప్రతి ఒక్కరికి ఆ క్రెడిట్ దక్కుతుంది. అంత నేచురల్‌గా వచ్చాయి ఆ సీన్స్.
ఓవరాల్‌గా జెర్సీ సినిమా ఈమధ్య కాలంలో వచ్చిన మోస్ట్ ఎమోషనల్ మూవీగా నిలిచిపోతుంది. ఒకట్రెండు చోట్ల సినిమా కాస్త స్లో అనిపించినప్పటికీ.. ఆ ఎమోషన్‌కు కనెక్ట్ అయిపోతాం. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది.
రేటింగ్ – 3.5/5
జీ సినిమాలు సౌజన్యంతో..