కికీ ఛాలెంజ్ పేరుతో రన్నింగ్ వాహనాల నుండి దిగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఇప్పటికే పోలీసులు ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. అలా కికీ ఛాలెంజ్ పేరుతో రోడ్డు మీద డ్యాన్స్ చేసే యువతీ యువకులపై కేసులు నమోదు చేస్తామని కూడా పేర్కొన్నారు. అయినా కూడా కొందరు యువకులకు ఈ ఛాలెంజ్ ఓ గొప్ప ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కడ పెడితే అక్కడ కికీ ఛాలెంజ్ చేస్తూ.. ఆ ఛాలెంజ్ వీడియోలను యూట్యూబులో పోస్టు చేయడమే దినచర్యగా పెట్టుకుంటున్నారు కొందరు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే ముంబయి రైల్వేస్టేషనును కూడా కికీ ఛాలెంజ్‌కు వేదికగా చేసుకున్నారు కొందరు యువకులు. నిషాంత్‌ షా(20), ధ్రువ్‌ షా(23), శ్యాం శర్మ(24) అనే ముగ్గురు యువకులు రన్నింగ్ ట్రైను నుండి క్రిందకు దిగి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత ఆ డ్యాన్స్‌ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే ఈ వీడియో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు పోలీసుల కంటపడడంతో..వారు వెంటనే ఆ యువకులపై కేసు నమోదు చేసిన విసాయ్ ప్రాంతంలోని రైల్వే కోర్టులో వారిని హాజరుపరిచారు.


ఆ రైల్వేకోర్టులో యువకులు చేసిన నేరం ఒప్పుకోవడంతో కోర్టు వారికి ఓ విచిత్రమైన శిక్ష విధించింది. విసాయ్ రైల్వేస్టేషనును మూడు రోజుల పాటు ఆ యువకులు శుభ్రం చేయాలని.. వారు అలా స్టేషన్‌ను శుభ్రం చేస్తున్నప్పుడు.. వీడియోలను కూడా తీయాలని కోర్టు అధికారులను ఆదేశించింది. అలాగే ఆ యువకులు కికీ ఛాలెంజ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాల గురించి రైల్వే స్టేషనుకి వచ్చే ప్రయాణికులకు అవగాహన కల్పించాలని.. ఈ రెండు టాస్కులను ఆ యువకులు తప్పనిసరిగా పూర్తిచేయాలని కోర్టు తెలిపింది.