మరింత విస్తరించిన ఐడియా.. సేవల్ని ఎంచుకుంటే 30 జీబీ డేటా ఫ్రీ
ప్రస్తుతమున్న పోటీ నేపథ్యంలో ఐడియా తన సేవలను మరింత విస్తరించింది. దేశవ్యాప్తంగా మరో 15 సర్కిళ్లలో 4జీ వోల్టే సేవలు అందుబాటులోకి తెచ్చింది. వీటితో పాటు 30 జీబీ ఉచిత డేటా అందించేందుకు ప్లాన్ సిద్ధం చేసింది.
వివరాల్లోకి వెళ్లినట్లయితే ఈ నెల ఆరంభంలో ఏపీ సర్కిల్ సహా ఆరు సర్కిళ్లలో ఐడియా తన సేవలు ప్రారంభించగా.. తాజాగా తొమ్మిది సర్కిళ్లలో 4జీ వోల్టే సేవల్ని ప్రారంభించింది. ప్రారంభ ఆఫర్ కింద 4జీ వోల్టే సేవల్ని ఎంచుకునే వారికి ఉచితంగా 30 జీబీ డేటా ఇస్తున్నట్టు ఐడియా ప్రకటించింది.
4జీ వోల్టే సేవలను ఎంచుకున్న వారికి తొలుత 10 జీబీ డేటా అందుబాటులోకి తెస్తారు. దీనికి వాలిడిటీ నాలుగు వారాల పాటు ఉంటుంది. నాలుగు వారాల తర్వాత యూజర్లు ఐడియా సేవల గురించి తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఫీడ్ బ్యాక్ తీసుకున్న వెంటనే మళ్లీ వారికి మరో 10 జీబీ డేటా లభిస్తుంది. ఇలా మరో నాలుగు వారాల తర్వాత మరోసారి ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో మరో 10 జీబీ ఉచిత డేటా లభిస్తుంది. ఇలా దశల వారీగా ఉచిత డేటాను అందించాలని ఐడియా నిర్ణయింది.