హౌస్‌ఫుల్ 4: నానా పాటేకర్ బదులు రానా దగ్గుబాటి?
హౌస్‌ఫుల్ 4: నానా పాటేకర్ స్థానంలో రానా దగ్గుబాటి?
బాలీవుడ్‌లో మరోసారి నటించే అవకాశం రానా దగ్గుబాటికి దక్కనుందా? అంటే అవుననే అంటోంది బీటౌన్. బాహుబలిలో 'భల్లాల దేవ' గా నటించిన రానాకి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రసంశలు దక్కిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో బాహుబలి సిరీస్‌లతో కూడా రానా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
రానా బాలీవుడ్‌లో నటించడం ఇదే తొలిసారి కాదు. 2011 నుంచి బాలీవుడ్‌లో నటిస్తున్నారు. దం మారో దం, డిపార్ట్‌మెంట్, యే జవానీ హై దీవానీ, బేబీ, ది ఘాజీ అటాక్, వెల్ కమ్ టు న్యూయార్క్, బాహుబలి సిరీస్‌లతో అక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
తాజాగా రానా.. నానా పాటేకర్ స్థానంలో 'హౌస్‌ఫుల్ 4' లో నటిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇటీవలే చిత్ర యూనిట్ రానాను సంప్రదించిందని, అందుకు రానా ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. హౌస్‌ఫుల్ 4 లో హీరోగా అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.
ఇటీవలే మీ టూ ప్రకంపనల కారణంగా సినీ ఇండస్ట్రీలో నిర్మాణంలో ఉన్న సినిమాలపై ప్రభావం పడింది. తనుశ్రీ దత్తా నానా పాటేకర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో.. హౌస్‌ఫుల్ 4లో నటిస్తున్న నానా పటేకర్ తప్పుకున్నారు. ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి సీనియర్ నటుడు అనీల్ కపూర్, సంజయ్ దత్‌ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం రానా ఎన్.టీ.ఆర్ బయోపిక్‌లో బిజీగా ఉన్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రానా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం విడుదల కానుంది.