తిత్లీ బాధితులకు బాలయ్య భారీ విరాళం
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తిత్లీ బాధితులకు భారీ విరాళాన్ని ప్రకటించారు.
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తిత్లీ బాధితులకు భారీ విరాళాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి తాను రూ.25 లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే పలు ప్రముఖ సంస్థలు కూడా తిత్లీ బాధితులకు విరాళాలు ప్రకటించాయి. స్టేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ సొసైటీ తమ ఒకరోజు వేతనాన్ని తిత్లీ బాధితులకు అందజేస్తున్నట్లు ప్రకటించింది. కాగా.. ఇటీవలే తిత్లీ బాధితుల సహాయార్థం తాము రూ.కోటి విరాళం ప్రకటిస్తున్నామని వైసీపీ పార్టీ తెలిపింది. ఇటీవలే ఉత్తరాంధ్రలో సంభవించిన తిత్లీ తుఫాను వల్ల శ్రీకాకుళం ఇత్యాది ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లింది.
తుఫాను వల్ల దాదాపు రూ.2,500 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. తక్షణ సాయంగా రూ.1,200 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి తాను లేఖ రాసినా.. ఎవరూ కనీసం పట్టించుకోలేదని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో ప్రజలందరూ సహాయం చేయడానికి ముందుకు రావాలని.. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరివిగా విరాళాలు ఇచ్చి... తిత్లీ బాధితులను ఆదుకోవాలని చంద్రబాబు తెలియజేశారు. అలాగే తాము బాధితులను ఆదుకోవడానికి నిరంతరం శ్రమిస్తుంటే.. ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని కూడా చంద్రబాబు పేర్కొన్నారు.
తిత్లీ బాధితులకు సహాయం చేసేందుకు వచ్చిన సినీ నటుల్లో తొలి అడుగువేసింది సంపూర్ణేష్ బాబు కావడం విశేషం. ఆయన తుఫాన్ జరిగిన మర్నాడే.. రూ.50,000 ముఖ్యమంత్రి సహాయనిధికి పంపారు. తర్వాత నటుడు విజయ్ దేవరకొండ తనవంతు సాయంగా రూ. 5లక్షలు ప్రకటించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ రూ. 15 లక్షలను, కల్యాణ్ రామ్ రూ. 5 లక్షలను ఏపీ సీఎం సహాయనిధికి పంపుతున్నట్టు ప్రకటించారు. అలాగే నటుడు వరుణ్ తేజ్ కూడా తనవంతు సహాయంగా రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు.