ఫేస్‌బుక్ సర్వేలో ట్రంప్‌ని ఓడించిన మోదీ..!
ఫేస్‌బుక్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు కలిగిన దేశాధినేతల జాబితాపై సర్వే చేసిన ఓ సంస్థ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందున్నారని తెలిపింది.
ఫేస్‌బుక్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు కలిగిన దేశాధినేతల జాబితాపై సర్వే చేసిన ఓ సంస్థ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందున్నారని తెలిపింది. దాదాపు 43.2 మిలియన్లమంది నరేంద్ర మోదీని అనుసరిస్తుండగా.. ట్రంప్‌ని కేవలం 23.1 మిలియన్ల మంది మాత్రమే అనుసరిస్తుండడం గమనార్హం. బర్సన్ కాన్ అండ్ ఉల్ఫ్ అనే సంస్థ ఈ రోజే "వరల్డ్ లీడర్స్ ఆన్ ఫేస్‌బుక్" అనే జాబితా విడుదల చేసింది.
అయితే అత్యధిక లైకులు, కామెంట్లు, షేర్లు కలిగిన నాయకుడిగా ఇంకా ట్రంప్ మాత్రమే కొనసాగడం విశేషం. దాదాపు 204.9 మిలియన్ ఇంటరాక్షన్స్‌తో ఆయన తొలి స్థానంలో కొనసాగుతుండగా... 113.6 మిలియన్ల ఇంటరాక్షన్స్‌తో మోదీ రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. ఇంటరాక్షన్స్ విషయానికి వస్తే వీరిద్దరి తర్వాతి స్థానాల్లో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో (46 మిలియన్ల ఇంటరాక్షన్స్), కాంబోడియా ప్రధాని శాండెక్ హన్సెన్ (36 మిలియన్ల ఇంటరాక్షన్స్) ఉన్నారు.
తాజా సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 193 దేశాల్లో కేవలం 175 దేశాలకు మాత్రమే అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలు ఉన్నాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 109 దేశాల అధినేతలు, 86 దేశాధ్యక్షులతో పాటు 72 దేశాల విదేశాంగ శాఖ మంత్రులు మాత్రమే వ్యక్తిగత ఫేస్‌బుక్ పేజీలను కలిగి ఉన్నారు.
మార్చి 15, 2018 నాటికి ప్రపంచంలోని అన్ని దేశాల అధినేతల ఫేస్‌బుక్ పేజీలను పరిశీలిస్తే.. దాదాపు 309.4 మిలియన్ల మంది ఈ పేజీలను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇంటరాక్షన్స్ విషయానికి వస్తే అవి దాదాపు 900 మిలియన్లు దాటాయి. అలాగే వీడియోలు పంచుకుంటూ... లైవ్‌లో పాల్గొంటున్న దేశాధినేతల శాతం కూడా రోజు రోజుకూ పెరుగుతుందని సర్వే చెబుతోంది