Revanth Reddy Stands with Sunil Kanugolu: కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో పోలీసులు సోదాలు చేసి సీజ్ చేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు జరుగుతాయి. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ లో పోలీసుల పెత్తనం చేయడం ఏంటని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రధాన ప్రతిపక్షం హోదాలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తుంటే పోలీసులు ఇలా అడ్డగోలుగా వ్యవహరించడం దారుణం అని మండిపడ్డారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో పోలీసులు తల దూరిస్తే చూస్తూ ఊరుకోం అని రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసులను హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై, ప్రజలపై ఈ నిర్బంధం ఇలాగే కొనసాగితే చివరకు ప్రజా ఆగ్రహానికి గురవుతారని కేసీఆర్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆఫీసుపై పోలీసుల దాడికి నిరసనగా రేపు బుధవారం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. 


అంతేకాకుండా.. కాంగ్రెస్ వార్ రూమ్‌పైన దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాల్సిందిగా పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరికి వ్యతిరేకంగా కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి సూచించారు.