క్యాన్సర్ వ్యాధితో పోరాడే వారందరికీ ప్రముఖ సినీ నటి సొనాలి బింద్రె జీవితం ఓ ఆదర్శం... స్పూర్తిదాయకం అనే చెప్పుకోవాలి. తనకు క్యాన్సర్ తీవ్రస్థాయిలో ఉందని ఆమె ఎప్పుడైతే తెలుకున్నారో అప్పుడే చికిత్స పొందడం మొదలుపెట్టారు. అప్పటి నుంచే ఎప్పటికప్పుడు తన చికిత్సకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తూ వచ్చారు. అదే సమయంలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఆ వ్యాధితో ఎలా పోరాడాలో పాఠాలు కూడా నేర్పుతూ వచ్చారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ ఫిలిం జర్నలిస్ట్ రాజీవ్ మసంద్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తనకు క్యాన్సర్ సోకిందని తొలిసారిగా తెలుసుకున్నప్పటి చేదుజ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ''తాను వద్దని వారిస్తున్నా వినకుండా తన భర్త తనను చికిత్స కోసం న్యూయార్క్ తీసుకెళ్లాడని, విమానంలో కూడా దారిపొడవునా అతడితో ఆ విషయమై వాదిస్తూనే వున్నాను'' అని చెప్పిన సొనాలి బింద్రె... అక్కడికెళ్లాకే అసలు విషయం తెలిసిందని అన్నారు. ''న్యూయార్క్ వెళ్లిన మరునాడు డాక్టర్‌ని కలిశాం. అన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరం.. క్యాన్సర్ 4వ దశలో ఉందని, బతకడానికి కేవలం 30 శాతమే అవకాశాలున్నాయని డాక్టర్ చెప్పారు. తన భర్త తనని ఎందుకు అంత దూరం తీసుకెళ్లాడో అప్పుడే తనకు అర్థమైంది'' అని ఆనాటి అనుభవాలను సొనాలి బింద్రె ఈ ఇంటర్వ్యూలో నెమరు వేసుకున్నారు. 


న్యూయార్క్ వెళ్లిన ఆరు నెలల అనంతరం 2018 డిసెంబర్‌లో భారత్‌కి తిరిగొచ్చిన సొనాలి బింద్రె.. ఆ తర్వాత ఇటీవలే ఓ ఫ్యాషన్ మేగజైన్‌కి ఫోటోషూట్ కోసం ఎంతో ఉత్సాహంగా ఫోజిచ్చిన సంగతి తెలిసిందే.