ముంబాయి: బాలీవుడ్ నటి సోన‌మ్ క‌పూర్ పెళ్లి వార్తలపై కొద్దిరోజులుగా వస్తున్న వరుస కథనాలకు, వార్తలకు తెరపడింది. మే 8, 2018న త‌న బాయ్ ఫ్రెండ్ ఆనంద్ అహూజాని సోనమ్ కపూర్ వివాహం చేసుకోబోతోంది. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల సభ్యులు అధికారికంగా వెల్లడించకపోయినా.. పెళ్లికి సంబంధించిన పనులన్నీ చకచకా చేసుకొని పోతున్నారు. వెడ్డింగ్ కార్డులను ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొద్దిరోజులుగా సోనమ్-ఆనంద్ పెళ్లిపై వరుసపెట్టి వార్తలు వ‌స్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాక‌పోవ‌డంతో 'కపూర్' అభిమానుల‌లో సందిగ్ధత నెలకొంది. సోన‌మ్ తండ్రి అనిల్ క‌పూర్ ఇటీవ‌లే త్వర‌లోనే మీకు అన్ని విష‌యాలు చెబుతాన‌ని అన్నారే గానీ పెళ్ళిపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే ముంబైలో మే 7వ తేదీన మెహందీ కార్యక్రమంతో, మే 8న సోన‌మ్-ఆనంద్ వివాహం జ‌ర‌గ‌నుంది. అందుకు సంబంధించిన వెడ్డింగ్ కార్డులను కుటుంబ సభ్యులే ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేశారని సమాచారం.


నిరాడంబ‌రంగా వివాహం చేసుకుంటున్న సోన‌మ్ తాను ఆడంబరాలకు డబ్బు ఖర్చుపెట్టడం కంటే దానిని ఎవరికైనా అవసరం ఉన్నవాళ్లకు ఇస్తానని చెప్పింది. మ‌రో మూడు రోజుల‌లో జ‌ర‌గ‌నున్న సంగీత్, మెహందీ సెర్మనీల కోసం ఫ‌రా ఖాన్ నేతృత్వంలో క‌పూర్ ఫ్యామిలీ మొత్తం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోందట. హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని టాక్. సోనమ్ ప్రస్తుతం వీరే ది వెడ్డింగ్‌, సంజూ సినిమాలతో బిజీగా ఉంది.



 


ఎవరీ ఆనంద్ అహూజా..?


ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త హరీశ్ అహూజా కుమారుడు ఆనంద్ అహూజా. భారత్‌లోనే అతిపెద్ద ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ అయిన షాహీ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ వీరి కుటుంబానిదే. వీరి మొత్తం ఆస్తుల విలువ రూ.3000 కోట్ల పైమాటే. ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ స్కూల్‌లో చదువుకుని అనంతరం యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఎకనామిక్స్ అండ్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్‌లో గ్రాడ్యుయేషన్.. వార్డన్ బిజినెస్ స్కూళ్లో ఎంబీఏ చేశారు. చదువు తర్వాత అమెజాన్‌లో స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్లకు ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. 2014లో ఓ స్నేహితురాలి ద్వారా సోనమ్ పరిచయమైంది. ఆ పరిచయం కాస్త  ప్రేమగా మారింది.