ప్రముఖ నిర్మాత వాకాడ అప్పారావు పై సినీ నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ వద్ద అర్థ నగ్న ప్రదర్శన చేసి.. తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి బహిర్గతం చేసిన ఈమె ఇప్పుడు మరోసారి ట్విటర్ ద్వారా విరుచుకుపడింది. ఇప్పటికే దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు అభిరామ్‌తో పాటు పలువురి పై ఆరోపణలు చేసిన ఈమె ఈసారి ఓ నిర్మాత పై బహిరంగ ఆరోపణలు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే మెగాస్టార్ చిరంజీవికి కూడా సందేశం పంపింది. "మెగాస్టార్ చిరంజీవి గారు.. ఇతను మీ పేరు చెప్పుకుని 16 సంవత్సరాల ఆడపిల్లలతో సహా.. ఎంతో మంది ఆడవారి జీవితాలను నాశనం చేసాడు, దయచేసి ఇటువంటి వారిని ప్రోత్సహించకండి" అని వాకాడ అప్పారావు ఫోటో పెట్టి ట్వీట్ చేసింది. ఇదే ట్వీట్‌కు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. శ్రీరెడ్డిని సపోర్టు చేస్తూ మాట్లాడారు.


నిర్మాత వాకాడ అప్పారావు గురించి తాను తెలుసుకున్న విషయాలు ఎంతో షాక్‌కు గురి చేశాయని.. మంచి మనసు గల వ్యక్తులంతా ఇలాంటి వేధింపులకు గురయ్యే బాధితులతో కలిసి మాట్లాడి.. వీలైతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి.. ఇలాంటి ఘోరాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు. ఆర్బీ చౌదరి నిర్మించిన పలు సినిమాలకు సహాయ నిర్మాతగా వ్యవహరించిన వాకాడ అప్పారావు.. అత్త మెచ్చిన అల్లుడు, మహారథి లాంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అలాగే, ఖైదీ నెంబర్ 150, జూలీ 2 లాంటి సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్‌గా కూడా పనిచేశారు.