కేరళ కుట్టి, ప్రముఖ మళయాళం హీరోయిన్ ప్రియ ప్రకాశ్ వారియర్‌పై తెలంగాణలో నమోదైన ఓ ఎఫ్ఐఆర్‌ను సుప్రీం కోర్టు ఇవాళ కొట్టేసింది. ఒడు అడార్ లవ్ అనే మళయాళం సినిమాలో నటి ప్రియ ప్రకాశ్ వారియర్ ఓ పాటలో కన్నుగీటుతూ నటించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పాటపై అప్పట్లో దేశవ్యాప్తంగా పెనుదుమారమే చెలరేగింది. యువతను చెడగొట్టే రీతిలో సినిమాలు వస్తున్నాయంటూ పలు ప్రజా సంఘాలు ఈ సినిమాకు వ్యతిరేక ప్రదర్శనలలు సైతం నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని పలు ముస్లిం సంఘాల మత పెద్దలు ఫిబ్రవరి 18న నటి ప్రియ ప్రకాశ్ వారియర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సినిమా విడుదల అడ్డుకోవాల్సిందిగా వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.



హైదరాబాద్‌లో ప్రియ ప్రకాశ్ వారియర్‌పై నమోదైన ఫిర్యాదుపై చిత్ర యూనిట్ వర్గాలు సుప్రీం కోర్టుని ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలోనే ప్రియ ప్రకాశ్ వారియర్ తరపు న్యాయవాది వాదనలు విన్న సుప్రీం కోర్టు.. హైదరాబాద్‌లో నటి ప్రియ ప్రకాశ్ వారియర్‌పై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేస్తున్నట్టు ఇవాళ ఉదయం స్పష్టంచేసింది.