సూరత్ ప్రాంతానికి చెందిన డైమండ్ వ్యాపారి సావ్జీ దొలాకియా ఈ దీపావళి సందర్భంగా మరో చిత్రమైన నిర్ణయం తీసుకున్నారు. తన సంస్థలో ఓ విభాగంలో పనిచేస్తున్న 600 మంది ఉద్యోగులకూ కారు గిఫ్ట్‌గా ఇస్తున్నానని తెలిపారు. ఇచ్చిన మాట తప్పకుండా ఈ రోజు తన స్టాఫ్ అందరికీ వారి వారి కార్ల తాళాలను అందించారు. హరే క్రిష్ణ ఎక్స్‌పోర్ట్స్ పేరిట కంపెనీ నడుపుతున్న ఈ వ్యాపారి తీసుకున్న అనూహ్య నిర్ణయానికి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే తన కంపెనీలోని ఆయా విభాగంలోని తొలి నలుగురు ఉద్యోగులకూ మాత్రం ప్రధాని మోదీ చేతుల మీద ఆయన కారు తాళాలను అందించడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాయెల్టీ బోనస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆయన ఈ కానుకలను అందించారు. ఆయన అందించిన ఒక్కో కారు విలువ రూ.4.4 లక్షల రూపాయల నుండి 5.3 లక్షల రూపాయల వరకూ ఉంటుందట. అయితే తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కానుకలు ఉంటాయని ఆయన తెలిపారు. ప్రతీ సంవత్సరం ఉత్తమ ప్రదర్శన కనబరిచే టీమ్‌లకు మాత్రం ఆయన చాలా ఖరీదైన బహుమతులు ఇస్తుంటారట. ఈసారి ఆ ఖరీదైన బహుమతి ఓ టీమ్‌కి కార్ల రూపంలో దక్కిందట.


2016లో కూడా ఇదే మాదిరిగా ఆయన 400 మంది ఉద్యోగులకు సొంత ఫ్లాట్లు కొని ఇచ్చారు. సౌరాష్ట్రలోని అమ్రేలీ ప్రాంతానికి చెందిన ఈ డైమండ్ వ్యాపారి తొలుత చాలా చిన్న లోన్‌ తీసుకొని బిజినెస్ ప్రారంభించారట. తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు ఈ స్థాయికి చేరారట. ప్రస్తుతం ఆయన కంపెనీ టర్నోవర్ 6000 కోట్లకు పైమాటే. ఆయన కంపెనీలో వివిధ విభాగాల్లో డైమండ్ ఆర్టిస్టులు, ఇంజనీర్లు పనిచేస్తున్నారు. దాదాపు 5000 మంది  ఉద్యోగులు ఆయన కంపెనీలో పనిచేస్తున్నారు.