Sushant Singh Rajput suicide | ముంబై: బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని బాంద్రాలో ఉన్న తన నివాసంలోనే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సీలింగ్‌కి ఉరివేసుకుని చనిపోయాడు. ప్రస్తుతం అతడి వయస్సు 34 ఏళ్లు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య సమాచారం అందుకున్న ముంబై పోలీసులు అతడి నివాసానికి చేరుకుని ఇంటిని పూర్తిగా పరిశీలిస్తున్నారు. గత కొన్ని నెలలుగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కొంత మానసిక సమస్యలతో ఆందోళనగా ఉన్నట్టు తెలుస్తోంది. పవిత్ర రిష్తా (పవిత్ర బంధం) అనే టీవీ షో ద్వారా టీవీ నటుడిగా బుల్లి తెరకు పరిచయమైన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి టెలివిజన్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత 2013లో కై పో చె అనే చిత్రం ద్వారా బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చాడు. ( హార్ట్ ఎటాక్‌తో యువ దర్శకుడు మృతి )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజ్ కుమార్ హిరాని తెరకెక్కించిన పీకె చిత్రంతో సుశాంత్‌కి మంచి పేరు, గుర్తింపు లభించాయి. ఈ సినిమాలో విదేశంలో పరిచయమైన భారతీయ యువతిని ప్రేమించి.. ఆమె కోసమే ఎదురుచూస్తున్న పాకిస్తాన్ పౌరుడిగా, ఓ భగ్న ప్రేమికుడి పాత్రలో సుశాంత్ సింగ్ పర్‌ఫార్మెన్స్‌కి మంచి మార్కులే పడ్డాయి. అనంతరం క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమాలోనూ ధోనీ పాత్రలో లీడ్ రోల్ పోషించి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కేదార్‌నాథ్, సోంచిరియా, చిచోర్ చిత్రాల్లో సుశాంత్ నటించాడు. దిల్ బెచారా అనే అప్‌కమింగ్ సినిమాలోనూ సుశాంత్ నటించాల్సి ఉంది. కానీ ఈలోపే ఇలా అతడు అర్థాంతరంగా తనువు చాలించడం బాలీవుడ్‌ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకుగల కారణాలు ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ( Sushant Singh Rajput post mortem report) వస్తే కానీ అసలు కారణం ఏంటో తెలిసే అవకాశం లేదని ముంబై పోలీసులు చెబుతున్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..