కలెక్షన్ల మోత మోగిస్తోన్న `టాక్సీవాలా`.. తొలి రోజు వసూళ్లే రూ.10.5 కోట్లు..!
విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రం ఒక రకంగా చెప్పాలంటే బాక్సాఫీసును షేక్ చేస్తోంది.
విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రం ఒక రకంగా చెప్పాలంటే బాక్సాఫీసును షేక్ చేస్తోంది. విడుదలైన మొదటి రోజునే ప్రపంచ వ్యాప్తంగా రూ.10.5 కోట్లు (గ్రాస్) వసూలు చేసి చిన్న సినిమాల్లో సరికొత్త రికార్డును నమోదు చేసిందీ సినిమా. ఈ వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో హిట్ చిత్రాల యువ కథానాయకుడిగా పేరు గాంచిన విజయ్ దేవరకొండ.. ఈ మధ్యకాలంలో "నోటా" చిత్రంలో కూడా నటించారు. అయితే ఆ చిత్రం అనుకున్నంత విజయాన్ని సాధించి పెట్టలేదు.
ఈ క్రమంలో ఇటీవలే విడుదలైన ఆయన చిత్రం ‘టాక్సీవాలా’ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆయన మళ్లీ ఫామ్‌లోకి వచ్చారని అంటున్నారు తన అభిమానులు. ఇటీవలే రౌడీ వేర్ పేరుతో విజయ్... ఫ్యాషన్ టెక్స్‌టైల్స్ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ అనే చిత్రంలో నటించేందుకు సైన్ చేశారు విజయ్. భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది.
ఇక ‘టాక్సీవాలా’ చిత్ర విషయానికి వస్తే.. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రంపై పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో మాళవికా నాయర్, కళ్యాణి, ఉత్తేజ్ మొదలైనవారు ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 6 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. అమెరికాలో రూ.2 కోట్లు, కర్ణాటకలో రూ.4 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. గతంలో "ది ఎండ్" అనే హారర్ చిత్రానికి దర్శకత్వం వహించిన రాహుల్ ‘టాక్సీవాలా’ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు.