చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి చిత్రాన్ని బుధవారం తెలంగాణ గవర్నర్‌ డా తమిళిసై సౌందరరాజన్‌ వీక్షించారు. స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యలవాడ నరసింహా రెడ్డి రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతోంది. శనివారం నాడు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన చిరంజీవి.. సైరా చిత్రం చూడాల్సిందిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డా తమిళిసై కోసం చిరంజీవి బుధవారం ప్రత్యేక షో ఏర్పాటు చేశారు. గవర్నర్‌తోపాటు ఆమె కుటుంబ సభ్యులు, చిరంజీవి కుమార్తె సుష్మిత ఈ ప్రత్యేక షోలో చిత్రాన్ని వీక్షించారు. చిత్రాన్ని వీక్షించిన అనంతరం తమిళిసై మాట్లాడుతూ.. ఈ చిత్రం తనకు బాగా నచ్చిందని అన్నారు. సినిమాపై ప్రశంసలు గుప్పించిన ఆమె.. ఇంత గొప్ప చిత్రానికి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల బృందం, నిర్మాతలను అభినందించారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గాంధీజీ 150వ జయంతి నాడు చిరంజీవి నటించిన ఈ సినిమా విడుదలవడం గాంధీజీకి సరైన నివాళి లాంటిదని అన్నారామె. అంతేకాకుండా ఉయ్యాలవాడకు నమ్మకస్తుడైన యుద్ధ వీరుడి పాత్రను చూసినప్పుడు తమిళ, తెలుగు వారి మధ్య సోదరభావం గుర్తుకొస్తుందన్నారు. ట్విటర్ ద్వారా సైరా సినిమాపై ప్రశంసల జల్లు కురిపించిన తమిళిసై సౌందరరాజన్.. ప్రతీ ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది అని ట్వీట్ చేశారు.


 



గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 2న విడుదలైన సైరా నరసింహా రెడ్డి సినిమాలో బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్, శాండల్‌వుడ్ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్‌, తమిళ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి, టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి ప్రముఖులు నటించారు.