హైదరాబాద్: టాలీవుడ్ ఫిలిం చాంబర్‌ వద్ద గతంలో శ్రీరెడ్డి చేసిన ఆందోళన ఆమెను ఏ స్థాయిలో వార్తల్లో నిలబెట్టిందో అందరికీ తెలిసిందే. తాజాగా మరో యువతి కూడా ఫిలిం చాంబర్‌లో నిరసనకు దిగి వార్తల్లోకెక్కింది. కాకపోతే శ్రీరెడ్డి అంత ఘాటు నిరసన కాకుండా తనను తాను గొలుసులతో బంధించుకుని నిరసన తెలియజేసిందామె. మంగళవారం రాత్రి ఫిలించాంబర్ వద్ద నిరసనకు దిగిన యువతిని సునీత బోయ అనే జూనియర్ ఆర్టిస్టుగా గుర్తించారు. ఫిలిం చాంబర్ వద్ద సునీత బోయ అనే యువతి ఆందోళనకు దిగిన విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఉదయం ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సునీత బోయ చెబుతున్న వివరాల ప్రకారం.. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపిస్తుందామె. తనకు జరిగిన అన్యాయంపై గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ స్పందించాలని డిమాండ్ చేస్తూ సునీత బోయ నిరసనకు దిగారు. గీతా ఆర్ట్స్ సంస్థపైనే కాకుండా జనసేన పార్టీపై సైతం ఆమె పలు ఆరోపణలు గుప్పించారు. పార్టీ కోసం కష్టపడిన తనను ఆదుకోవడానికి బదులుగా తనపైనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 


ఇక ఈ సునీత బోయ అనే యువతి వివరాల్లోకెళ్తే.. జూనియర్ ఆర్టిస్టుగా ఆడియెన్స్‌కి పెద్దగా పరిచయం లేని సునీత.. ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆయనపై గతంలో ఆరోపణలు చేయడం ద్వారా అప్పట్లో వార్తల్లోకెక్కిందామె. మళ్లీ ఇప్పుడిలా గీతా ఆర్ట్స్ సంస్థ, జనసేన పార్టీలపై ఆరోపణలతో ఫిలిం చాంబర్ వద్ద నిరసనకు దిగడం ద్వారా తిరిగి వార్తల్లొకెక్కింది. మరి సునీత బోయ చేస్తోన్న ఆరోపణలను ఫిలిం చాంబర్ లైట్ తీసుకుంటుందా లేక ఆమె ఆరోపణలపై స్పందిస్తుందా వేచిచూడాల్సిందే.